రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జలధి, గంగ పూజను ఘనంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూల విరాట్‌ను పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాన్ని పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత సమీపంలోని పాలబావి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చారు. గంగా జలంలో అమ్మవారి విగ్రహాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. అమ్మవారికి కట్టిన వడి బియ్యం, గాజులు, పండ్లు, పూలు, కొత్త దుస్తులు ఇతరత్ర వాటిని నైవేద్యంగా పాలబావికి సమర్పించారు. తిరిగి ఉత్సవ విగ్రహాన్ని యథావిధిగా ఆలయ ప్రాంగణంలోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు జ్యోతులను ఊరేగింపుగా తీసుకుచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి జ్యోతుల ఉత్సవాలు
మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వివిధ గ్రామాల వారి ఆధ్వర్యంలో అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. రోజుకో గ్రామం చొప్పున చుట్టు పక్కల గ్రామాల వారు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు.


