ఎన్‌పీకుంట: మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలి బోదకొట్టం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవి గొర్రెలు మేపుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం గొర్రెలను మేపునకు తీసుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో సిలిండర్ గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారిని శకుంతల సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు.
9న మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య శిబిరం
ప్రశాంతినిలయం: అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు ఈనెల 9వ తేదీన నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, డీసీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలో పుట్టపర్తి గణేష్ సర్కిల్‌లోని షాదీ మహల్‌లో ఉదయం 8 గంటల నుంచి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారన్నారు. శిబిరానికి స్పెషలిస్ట్ వైద్యులు విచ్చేస్తారన్నారు. మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందవచ్చన్నారు.
ఇంటర్ కళాశాలల పరిశీలన
పుట్టపర్తి: జిల్లాలోని పలు ఇంటర్ కళాశాలలను ఉన్నత విద్యాశాఖ అకడమిక్ అడ్వయిజర్లు పరిశీలించారు. కొత్తచెరువు ప్రభుత్వ కళాశాలను డాక్టర్ హైదర్ అలీ, డాక్టర్ నారాయణస్వామి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాజమహమ్మద్ తదితరులు కళాశాలను మంగళవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బోధనలో నాణ్యత, పరిశోధన, కరిక్యులం, ఈ గవర్నెన్స్ తదితరాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవికుమార్, అధ్యాపకులు శ్రీనివాసులు, డాక్టర్ ఓబులేషు, దస్తగిరి, ఆనంద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారికి ఊంజల్ సేవ
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి ఊంజల్ సేవను ఘనంగా చేపట్టారు. కదిరి మల్లెలు, తులసీ దళాలతో స్వామివారిని అలంకరించి శ్రీ రంగమండపంలో ఉయ్యాలోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏటా చైత్ర మాసం బహుళ పక్షం పంచమి రోజున ఊంజల్ సేవ నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.
పండ్ల మండీలో అగ్నిప్రమాదం
● రూ.2 లక్షల నష్టం
గుంతకల్లుటౌన్: పట్టణంలోని మోమినాబాద్ లో సయ్యద్‌బాషాకు చెందిన ఎస్‌బీ పండ్ల మండీలో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మండీలోని ఏసీలు, ఫ్రూట్ ప్లాస్టిక్ ట్రే బాక్స్‌లు, పండ్లు, ఫర్నీచర్ కాలిపోయాయి. రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మండీలో ఉన్న కూలీలు బయటికి పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి అశ్వర్థ, సిబ్బంది పాల్గొన్నారు.


