పెనుకొండ: పెనుకొండ మండలం మోట్రుపల్లి గ్రామంలో నెలకొన్న స్థల వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రి సవిత పీఏ నాగేంద్ర కుటుంబీకులకు, ఇతరులకు మధ్య సమస్య ఏర్పడింది. అయితే, ఇళ్లు కట్టుకుని నివసించిన ఆ స్థలం తమదంటే.. నేడు కొందరు తమదంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. గతంలో మోట్రుపల్లి పాత ఊరులో 12 మందికి పైగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు. కాలక్రమేణా ఇళ్లు పాతబడి పోవడంతో వారు ఆ ఇళ్లు వదిలి మరో చోట ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, వారి కుటుంబాలకు చెందిన ఈ స్థలంలో అన్నదమ్ములకు భాగాలు ఉండగా లక్ష్మిరెడ్డి అనే ఒక భాగస్తుడి నుంచి నాగేంద్ర, అతని సోదరుడి గౌరీశంకర్ తండ్రి ఎకరా భూమిని 2002లో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆ స్థల విస్తీర్ణం 70 సెంట్లు మాత్రమే ఉండడంతో నాగేంద్ర, అతని సోదరుడు పాడుబడిన ఇళ్ల స్థలం 30 సెంట్లు కూడా తమదేనని వాదనకు దిగారు. సర్వే కూడా చేయించారు. అయితే, కొన్నేళ్ల పాటు అక్కడ నివాసం ఉండి ఇటీవల ఇతర ప్రాంతానికి వెళ్లి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు దీనిపై ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ ఇళ్లకు కరెంటు బిల్లులు, ఇంటి గుత్తలు చెల్లించామని, నేడు ఆ స్థలం తమదేనని రావడం సమంజసం కాదని పేర్కొంటున్నారు. అయితే నాగేంద్ర, అతని సోదరుడు మాట్లాడుతూ ఆ స్థలం తమకు చెందినదనని అధికారులు సైతం నిర్ధారించారన్నారు. రిజిస్ట్రేషన్ రికార్డు మేరకే స్థలాన్ని తమకు అప్పగించాలని అధికారులను కోరామన్నారు. ఇరువర్గాలు ఈ విషయమై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమయ్యారు.
మంత్రి సవిత పీఏ నాగేంద్ర, అతని సోదరుడి తీరుపై బాధితుల ఆవేదన


