ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతోనే కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం ఉరవకొండలో 3వ జిల్లా కౌలు రైతు సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక గవిమఠం నుంచి వందలాది మంది కౌలు రైతులు సీపీఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో రాధాకృష్ణ మాట్లాడారు. కౌలు రైతుల బలవన్మరణాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అధికారంలోకి రాగానే కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చి జీవితాలు మార్చేస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్‌లు నేడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కనీసం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయలేదన్నారు. బ్యాంకు రుణాలు, పంటల బీమా, నష్ట పరిహారం, ఈ–పంట నమోదు అమలు చేయలేదన్నారు. మహాసభల్లో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యర్శి కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, అధ్యక్షుడు రంగారెడ్డి, ఉపాధ్యక్షుడు పెద్దమూస్టురు వెంకటేష్, సీపీఎం నాయకుడు మధు పాల్గొన్నారు.


