రొద్దం: మండల పరిధిలోని తురకలాపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి.చేతన్ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం వెంగప్ప, పీఈటీ రామకృష్ణ తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో పులివెందులలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో చేతన్ అద్భుత ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకూ న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో చేతన్ పాల్గొంటాడని తెలిపారు. పోటీల్లో మన రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థి చేతన్‌ను పాఠశాల ఉపాధ్యాయు బృందం అభినందించింది. జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
బేల్దారి ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని పోతుకుంట గ్రామానికి చెందిన బేల్దారి వినీత్‌కుమార్ (18) ఆదివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు .. మృతుడు బేల్దారి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉండేవాడు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వినీత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మద్యం తాగి ఆటో నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు
కదిరి టౌన్: పట్టణంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఆటో నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. కదిరి జడ్జి ముందు హాజరుపర్చగా రూ.10 వేలు జరిమానా విధించారన్నారు. గత నెలలో 8 కేసులు నమోదు చేశామన్నారు. వారందరికీ ఒక్కొక్కరికీ రూ.10 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికితే మొదటిసారి రూ.10 వేలు, రెండోసారి దొరికితే రూ.15 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
ఫుట్‌బాల్ జట్టుకు
ప్రాబబుల్స్ ఎంపిక
హిందూపురం టౌన్: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో బాలికల జూనియర్ ఫుట్‌బాల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా, వారిలోని నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా మొత్తం 27 మంది క్రీడాకారులను ప్రాబబుల్స్ కింద ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ తెలిపారు. ప్రాబబుల్స్‌కు ఎంపికై న వారికి క్యాంపు నిర్వహించి, తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా జట్టు తరుఫున ప్రాతినిత్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ సలీమ్, కోశాధికారి శేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు లోకనాథ్, కదిరప్ప, వినోద్, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.
కనుల పండువగా హనుమద్ వాహనోత్సవం
వజ్రకరూరు: మండల కేంద్రంలో జనార్దన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమద్‌వాహన కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు హోమాలు చేశారు. రాత్రి హనుమద్ వాహన కార్యక్రమం నిర్వహించారు. ఈఓ అంగదాల క్రిష్ణయ్య, ప్రధాన అర్చకుడు నరసింహమూర్తి, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాగా సోమవారం కల్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.


