పుట్టపర్తి టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై లెక్కలేనన్ని దారుణాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మండిపడ్డారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని అరాచకాల కట్టడికి చర్యలు చేపట్టాలని హితవు పలికారు. బాబు సర్కారు తీరుపై ఆదివారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా తట్టలతో భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలి, దళితులపై దాడులు ఆపాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీలు, ఎస్సీలపై హత్యలు, మానభంగాలు, దాడులు, అక్రమ కేసులు పెరిపోయాయన్నారు. దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు తాను పెద్ద మాదిగనంటూ మభ్యపెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి పంగనామాలు పెట్టారన్నారు. రాష్ట్రంలో దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సి వస్తోందని వాపోయారు. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు భిక్షాటన చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. మోసం చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దళిత సంఘాలను ఏకం చేసుకొని సర్కారు మెడలు వంచుతామని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలే దళిత మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు జుగుప్సాకరమని, ఇప్పటికీ అతడిని పదవి నుంచి తొలగించకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి తిప్పన్న, రాష్ట్ర కార్యదర్శులు ఎస్టీడీ నరశింహులు, ఆంజనేయులు, నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామయ్య, జిల్లా అధికారి ప్రతినిధి ఫోటో సాయి, రాష్ట్ర కార్యదర్శులు నరశింహులు అంజినప్ప, జిల్లా కార్యదర్శులు రంగనాథ్, చిన్నప్ప, కోగిర గంగాధర్, ఈశ్వర్, అజెంత, నాగరాజు,జిల్లా అర్గనైజింగ్ సెక్రటరీ కంబాలప్ప. పుట్టపర్తి పట్టణాధ్యక్షులు రవినాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు నారాయణ స్వామి, నాగేంద్ర, నరశింహులు, మండల అధ్యక్షుడు శంకర్, రమణ, సినిమా నారాయణప్ప, మధు, రామాంజి, సురేష్, దుర్గా ప్రసాద్, అమీన్‌బాషాఅంజేయులు, బండ్లపల్లి నరశింహులు, గోవిందప్ప, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు సర్కారు తీరు మారకుంటే తగిన బుద్ధి చెబుతాం
సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలి
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి


