కేజీబీవీలో కలెక్టర్ తనిఖీలు
మడకశిర రూరల్: మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న కేజీబీవీని సోమవారం రాత్రి కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రగతి, భోజనంలో నాణ్యతపై ఆరా తీశారు. వంట గది, స్టోర్ రూంతో పాటు నిల్వ ఉంచిన కూరగాయలు, అరటిపండ్లు పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ఉన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఎమ్మెల్యే తనిఖీ చేసిన సమయంలో ఎస్‌ఓ అందుబాటులో లేకపోవడం, పాఠశాలలో నాణ్యమైన భోజనం సక్రమంగా అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ముగ్గురికి షోకాజ్
కేజీబీవీలో నెలకొన్న సమస్యలపై మండల విద్యాధికారి అందించిన నివేదిక ఆధారంగా ఎస్‌ఓతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష పీఓ దేవరాజు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఎంఈఓ భాస్కర్ సోమవారం రాత్రి వెల్లడించారు.


