మీ అభిమానం మరువలేను
మడకశిర: ‘‘మీరు పలికిన ఈ అపూర్వ స్వాగతం చూసి నాకు నోట మాట రావడం లేదు... ఈ ప్రేమ, అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను’’ అంటూ భారత అంధ మహిళల క్రికెట్ టీ–20 కెప్టెన్ ఆనందభాష్పాలు రాల్చారు. ప్రపంచ కప్పు సాధించిన తర్వాత తొలిసారి ఆమె మడకశిరకు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. వేలాది మందితో రాజీవ్‌గాంధీ సర్కిల్ నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిర ప్రజలు, విద్యార్థులు దీపికపై పూల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన దీపికకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమే
మంత్రి సవిత మాట్లాడుతూ... విద్యార్థులు దీపికను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమేనని దీపిక నిరూపించిందన్నారు. ఆమె సాధించిన విజయం దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి పని చేయాలన్నారు. సినీ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ దీపిక దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని కోరారు.
అపూర్వ స్వాగతంతో దీపిక ఆనందభాష్పాలు
ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆర్థిక సాయం..10 సెంట్ల స్థలం
దీపికకు జిల్లా కేంద్రం పుట్టపర్తిలో 10 సెంట్ల స్థలాన్ని ఇస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. అలాగే మడకశిర నియోజకవర్గం తరఫున రూ. 2 లక్షలు, యాదవ సంఘం తరఫున మరో రూ. 2 లక్షలను చెక్కుల రూపంలో అందించారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు కూడా దీపికకు ఆర్థిక సాయం అందించారు. మడకశిరలోని ఇండోర్ స్టేడియానికి దీపిక పేరు పెట్టాలని పలువురు స్థానికులు కోరారు.
మీ అభిమానం మరువలేను


