హేమావతిలో వీరబల్లాల శాసనం
అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామ చెరువు వద్ద నొలంబ పల్లవ రాజులు నిర్మించిన శివాలయం గడపపై హోయసల ప్రభువు రెండో వీరబల్లాల శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి మంగళవారం గుర్తించారు. కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని శాలివాహన శకవర్షం 1111 సౌమ్య నామ సంవత్సరంలో హొయసల రెండో వీరబల్లాలుడు రాయించినట్లుగా తెలుస్తోందన్నారు. ఆంగ్ల సంవత్సరం ప్రకారం సామాన్య శకం 1189 నాడు వీరబల్లాలుడు శివాలయానికి భూమిని దానం చేసి ఉండవచ్చన్నారు. వాస్తవానికి స్తంభ శాసనం సగం కనిపిస్తుందని, మిగతా సగం గుడి మెట్టుకు ఆసరాగా ఉందన్నారు. రెండో వీరబల్లాలుడికి చెందిన 1206 నాటి మరో శాసనం సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర ఆలయ ద్వారబంధాల పైబాగంలో ఉందన్నారు.
చిరుత దాడిలో మేక మృతి
రొళ్ల: మండలంలోని టీడీపల్లికి చెందిన కాపరి నరసింహప్ప పోషిస్తున్న మేకల మందపై మంగళవారం సాయంత్రం చిరుత దాడిచేసింది. ఉదయం మందను గ్రామ పొలిమేర వద్దకు మేపు కోసం కాపరి తోలుకెళ్లాడు. సాయంత్రం మందను ఇంటికి మళ్లిస్తుండగా మార్గ మధ్యంలో పొదల చాటు నుంచి చిరుత దాడిచేసి, ఐదేళ్ల వయసున్న మేకను నోట కరుచుకుని పోయింది. ఆ సమయంలో కాపరులు వెంటపడి కేకలు వేయడంతో వంద మీటర్ల వరకూ మేకను లాక్కెళ్లి వదిలి పారిపోయింది. కాపరులు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మేక మృతి చెందింది. ఘటనతో సుమారు రూ.15 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు.
వ్యక్తి దారుణ హత్య
నల్లచెరువు: మండలంలోని ఓరువాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి నివాసి చలపతి (37) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీనం సాగిస్తున్న చలపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమ్మరవాండ్లపల్లి పక్కనే ఉన్న మల్లిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ భార్యతో కొన్నేళ్లుగా చలపతి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుక్ను వెంకటరమణ తన భార్యకు సర్దిచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. చివరకు భర్తతో గొడవపడి మూడేళ్ల క్రితం అయ్యన్నగారి కొత్తపల్లిలోని తన పుట్టింటికి ఆమె చేరుకుంది. అయినా చలపతి అప్పుడప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి వస్తుండడాన్ని వెంకటరమణ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మంగళవారం ఓరువాయి గ్రామ ఎల్లమ్మ గుడి సమీపంలో నిర్మాణ పనిప్రాంతంలోనే భోజనం చేస్తున్న చలపతి వెనుక నుంచి వేటకొడవలితో దాడి చేశాడు. ఘటనతో చలపతి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, నల్లచెరువు పీఎస్ ఎస్‌ఐ మక్బూల్ బాషా అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఆలయాల్లో హుండీ
కానుకల లెక్కంపు
మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను మంగళవారం దేవాదాయశాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. జిల్లెడగుంట ఆలయంలో హుండీల ద్వారా రూ.6,32,693, భక్తరపల్లి ఆలయంలోని తాత్కాలిక హుండీల ద్వారా రూ.2,07,410, శాశ్వత హుండీల ద్వారా రూ.10,87,490 చొప్పున మొత్తం రూ.21,64,958 నగదు సమకూరింది. ఈ మేరకు ఆలయాల ఈఓ నరసింహరాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధికారి అక్కిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరసేగౌడ్, సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు, అర్చకులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపిక
ధర్మవరం: ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు క్రీడాకారులను మంగళవారం ధర్మవరంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను జూడో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భాస్కరనాయుడు, పాఠశాల హెచ్‌ఎం సుమన, పీడీ స్వరూప, సరళ పర్యవేక్షించారు. ఎంపికై న వారిలో గవ్వల యువ సంధ్యా, జాహ్నవి, జనశ్రీ, సుస్మిత, కొండా అర్చన ఉన్నారు. వీరిని కోచ్ ఇనాయత్‌బాషా అభినందించారు.
హేమావతిలో వీరబల్లాల శాసనం
హేమావతిలో వీరబల్లాల శాసనం


