కర్ణాటకలో ప్రమాదం.. చలివెందల వాసి మృతి
భాగ్యనగర్ (బాగేపల్లి): మలుపులో ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందలకు చెందిన పలువురు మంగళవారం బాగేపల్లి తాలూకా లోని సుంకులమ్మ ఆలయానికి ఆటోలో వచ్చారు. బాగేపల్లి పట్టణ శివారులన 44వ జాతీయ రహదారిపై సాయిబాబా ఆలయం వద్ద మలుపు తీసుకోవాల్సి ఉండడంతో వాహనాల రాకను గమనించేందుకు డ్రైవర్ ఆటోను ఆపాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ఘటనలో ఆటోలో నుంచి కిందపడిన ఆదిమూర్తి (80) మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13 మందిని తొలుత బాగేపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిక్కబళ్లాపురలోని జిల్లాస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, లారీ, బస్సు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఫార్మసీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నవంబర్‌లో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర శేఖర్‌రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.


