పదేళ్ల బాబుకు పునర్జన్మ..
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్‌నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న పదేళ్ల బాలుడికి పునర్జన్మను ప్రసాదించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, చిన్నపిల్లల విభాగం ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీ డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్‌తో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
విష సర్పం కాటుతో..
పెద్దవడుగూరు మండలం కండ్లగూడురు గ్రామానికి చెందిన నారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, ఈ నెల 2న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిన్న కుమారుడు శివనారాయణ అర్ధరాత్రి సమయంలో మేల్కోని మూత్రవిసర్జనకంటూ బయటకు వచ్చాడు. ఆ సమయంలో కుప్పకూలిపోవడంతో తల్లిదండ్రులు ఆగమేఘాలపై పామిడిలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పాము కాటు (కట్ల పాముగా అనుమానం) కారణంగా అప్పటికే శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే సమయంలో ఇంటి వద్ద ఉన్న పదేళ్ల వయసున్న పెద్ద కుమారుడు శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమచారం అందుకున్న తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. బంధువులు అంబులెన్స్‌లో తీసుకురావడంతో పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అనంతపురానికి తీసుకెళ్లాలని పామిడిలో వైద్యులు సూచించారు.
36 గంటల నిరంతర శ్రమ
శివరామరాజును అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకువచ్చే లోపు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యులు వెంటనే చిన్నపిల్లల విభాగంలో అడ్మిట్ చేసుకుని పీఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి 36 గంటల పాటు నిరంతర వైద్య సేవలు అందించారు. కాస్త కోలుకున్న తర్వాత మరో రెండు రోజుల పాటు పీఐసీయే స్టెప్‌డౌన్‌లో, అనంతరం సాధారణ వార్డులో ఉంచి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో శివరామరాజుకు దాదాపు 40 వైల్స్ యాంటీ స్నేక్ వీనమ్ అందించడంతో పాటు ఖరీదైన మందులు, ఐసీసీయూ సౌలభ్యాన్ని ఉచితంగా అందించారు. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలు పొందాలంటే రూ.3లక్షలకు పైగా ఖర్చు అవుతుంది.
నిజంగా వారు దేవుళ్లు..
‘ఇప్పటికే ఓ బిడ్డ శివనారాయణను కోల్పోయాం. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ బతుకుతాడో.. లేదోనని మొక్కని దేవుడు లేడు. అయితే పెద్దాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మా బిడ్డను బతికించారు. నిజంగా వారు దేవుళ్లే’ అంటూ శివరామరాజు తల్లి లక్ష్మీదేవి భావోద్వేగంతో పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాబాయి, పీజీలు వాసవి, ప్రేమ్, జీవన్, లావణ్య, హౌస్‌సర్జన్ ఏంజెల్, స్టాఫ్‌నర్సులు మేరీ సుజాత, అరుణ, కీర్తి, పెద్దక్క, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్ చిన్నపిల్లల విభాగం ఘనత
ఈ నెల 2న అర్ధరాత్రి పాముకాటుకు గురైన అన్నదమ్ముళ్లు
పామిడి సీహెచ్‌సీకి చేర్చేలోపు తమ్ముడి మృతి
జీజీహెచ్‌లో చేరిన బాబుకు ప్రాణం పోసిన వైద్యులు, స్టాఫ్‌నర్సులు
పదేళ్ల బాబుకు పునర్జన్మ..


