22 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో ఈ నెల 22 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఈ మేరకు అన్ని పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇదిలా ఉండగా, ఎస్కేయూ పరిధిలో యూజీ మూడు, ఐదు సెమిస్టర్‌లకు సంబంధించి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. గుత్తి ఎంఎస్ డిగ్రీ కళాశాలలో ఒకరిని, హిందూపురం బాలాజీ విద్యామందిరంలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అనంతలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
అనంతపురం కల్చరల్: ఈ నెల 12, 13, 14 తేదీలలో అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, బ్రోచర్లను మంగళవారం వివేకానంద యోగభవన్‌లో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ వెల్ఫేర్ విభాగంలో యోగాకు గుర్తింపు దక్కడంతో రాష్ట్ర స్థాయి విజేతలను ఈ నెల 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద సంగమేశ్వరంలో జరిగే జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విజేతలు నేరుగా ఆసియన్ గేమ్స్‌లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో యోగాసన అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముత్యాలరెడ్డి, కేవీ రమణ, యోగా గురువులు దివాకర్, ఆంజనేయులు, మారుతీప్రసాద్, మహేష్, మల్లికార్జున పాల్గొన్నారు.


