రేపటి నుంచి టెట్
● జిల్లా నుంచి హాజరుకానున్న 4,529 మంది అభ్యర్థులు
● పుట్టపర్తిలో ఓ కేంద్రం, బెంగళూరులో మరో కేంద్రం ఏర్పాటు
పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ (ఏపీటెట్ అక్టోబర్ 2025) బుధవారం నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 10 తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా నుంచి 4,529 మంది అభ్యర్థులు ‘టెట్’కు హాజరుకానుండగా..పుట్టపర్తిలో ఒకటి, బెంగుళూరులో ఒకటి చొప్పున రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలోనికి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో పాటు గుర్తింపు కార్డు తీసుకొని గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని డీఈఓ సూచించారు.
వైభవంగా వసంతోత్సవం
● ముగిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
మడకశిర రూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వసంతోత్సవం, చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి పురోహితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవదాయశాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, వైఎస్సార్‌సీపీ నాయకులు మంజునాథ్, సుధీర్‌రెడ్డి, రాజశేఖర్, నగేష్, సర్పంచ్ రంగనాథ్ తదితరులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
ధర్మవరం అర్బన్: పట్టణంలోని క్రీడా మైదానంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం క్రీడామైదానంలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ గురించి ఈనెల 7వ తేదీన ‘ధర్మవరంలో టీ–3 బెట్టింగ్’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన డీఎస్పీ హేమంత్‌కుమార్ సోమవారం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహణలో ఇంకెవరి ప్రమేయం ఉందన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రేపటి నుంచి టెట్


