ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
సోమందేపల్లి: ‘‘వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి. అప్పుడు పేదలకు మెరుగైన వైద్యసేవలు.. నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కుతాయి. అలా కాకుండా చంద్రబాబు చెప్పినట్లు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఇప్పుడు ‘ఇండిగో’ సంస్థ లాగే ఆ ప్రైవేటు సంస్థలు నిరంకుశంగా వ్యవహరిస్తాయి. తద్వారా నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజ్‌లను ప్రైవేటీకరణ చేస్తోందని, తద్వారా వైద్య విద్యను నిరుపేదలకు అందని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ‘ఇండిగో’ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కేంద్రం ఆదేశాలు ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఇండిగో’ సంస్థ సర్వీసులు నిలిపివేయడంతో లక్షలాది మంది ఇబ్బంది పడ్డారని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువుపోయిందన్నారు. రేపు మెడికల్ కళాశాలలను ప్రైవేటికిచ్చినా ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు. అందువల్లే వైఎస్సార్ సీపీ నిరుపేదల పక్షాన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, వైస్ సర్పంచ్ వేణు, వైస్ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రఫీక్, సర్పంచ్ జిలాన్, నాయకులు ఆదినారాయణరెడ్డి, నరసింహమూర్తి, మంజు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి
‘ఇండిగో’ సంస్థ మొండి వైఖరితో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారని, ఈ అంశంలో టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆయన అసమర్థతతో భారత్ తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీజీసీఏ దిగివచ్చే దాకా ఇండిగో సంస్థ మొండిగా వ్యవహరించిందంటే వారి ధైర్యం ఏమిటో సదరు మంత్రే చెప్పాలన్నారు. విమానాలు రద్దయి లక్షల మంది విమానాశ్రయాల్లో గగ్గోలు పెడుతుంటే కేంద్ర మంత్రి జాతీయ మీడియాకు కూడా సమాధానం చెప్పకుండా రీల్స్ చూసుకుంటున్నారంటే పాలనపై ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. వెంటనే రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు.
మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి
పీపీపీ అంటూ ప్రైవేటుకిస్తే ‘ఇండిగో’లాగే ఉంటుంది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


