గంగమ్మ ఆలయ ఈఓకు రిమాండ్
● అమ్మవారి సొత్తు కాజేసేందుకు ప్రయత్నించిన ఫలితం
కదిరి అర్బన్: గంగమ్మ అమ్మవారికి భక్తులు కానుక రూపంలో అందజేసిన సొత్తును కాజేసేందుకు ప్రయత్నించి దొరికిపోయిన ఆలయ ఈఓ మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. సోమవారం కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణస్వామి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అక్రమంగా ఆటోలో తరలిస్తూ...
కదిరి మండల పరిధిలోని యర్రదొడ్డిలో వెలసిన గంగమ్మ తల్లికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 5 కేజీల వెండి, 1.980 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 చీరలు ఈఓ మురళీకృష్ణ ఈ నెల 7న అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూ. 6,23,600 విలువైన అమ్మవారి సొత్తును ఈఓ అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆటో సహా పోలీస్‌స్టేషన్ తరలించారు. అనంతరం పోలీసులు ఈఓ మురళీకృష్ణను విచారించారు. సొమ్ము తరలింపునకు అనుమతి పత్రాలు కోరగా..అలాంటివేమీ లేవన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల లిఖిత, మౌఖిక అనుమతి లేకుండా...రికార్డుల్లో నమోదు చేయకుండా భక్తులు సమర్పించిన కానుకలు తరలించడం నేరమని పోలీసులు తెలిపారు. అనంతరం దేవదాయశాఖ తనిఖీ అధికారి ప్రసాద్ (హిందూపురం) ఫిర్యాదు మేరకు ఈఓ మురళీకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. సీఐ నిరంజన్‌రెడ్డి, పలువురు పోలీసులు పాల్గొన్నారు.


