అడ్డొస్తున్నాడని హతమార్చారు!
పుట్టపర్తి టౌన్: వ్యక్తి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విజయకుమార్, సీఐ సురేష్, ఎస్‌ఐ కృష్ణమూర్తితో కలసి నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది జూలై 8న బుక్కపట్నం మండలం మారాల డ్యామ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆ గ్రామ వీఆర్‌ఏ పుల్లప్ప ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన బుక్కపట్నం పీఎస్ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితులుగా రెడ్డిపల్లికి చెందిన గంగాభవానీ, వంకరకుంటకు చెందిన గంగాధర్, విష్ణు, మోర్చలపల్లి నివాసి సుదర్శన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మృతుడు గంగాభవానీ భర్త రామప్పగా నిర్ధారణ అయింది. పదేళ్లుగా కొనసాగుతున్న గంగాభవానీ, గంగాధర్ వివాహేతర సంబంధానికి రామప్ప అడ్డుగా ఉండడంతో అతన్ని హతమార్చాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విష్ణు, సుదర్శన్‌ను కలుపుకుని నలుగురూ కలసి జూలై 8న ఇంట్లో నిద్రిస్తున్న రామప్ప తలపై బండతో దాడి చేశారు. కాళ్లు చేతులు పట్టుకుని దుప్పటితో గాలి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం రామప్ప మృతదేహాన్ని స్కూటీలో తరలిస్తుండగా టైర్ పంచర్ కావడంతో ఆటోలో తరలించి మారాల డ్యామ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. మృతదేహం వద్ద పడి ఉన్న కడియం ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ చేయడంతో నేరాన్ని వారు అంగీకరించారు. దీంతో శుక్రవారం నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, ఆటో, స్కూటీ, హత్యకు వినియోగించిన దుప్పటిని స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
భార్యతో సహ ముగ్గురికి రిమాండ్
వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్


