గువ్వలగుట్టపల్లిలో ఆక్రమిత భూమి సర్వే
పుట్టపర్తి అర్బన్: మండల పరిధిలోని గువ్వలగుట్టపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 763లోని ప్రభుత్వ భూమిని రెవెన్యూ సిబ్బంది గురువారం సర్వే చేపట్టారు. ఈ భూమిని ఆక్రమించేందుకు ఓ టీడీపీ నేత చదును చేయిస్తుండగా.. ‘ప్రభుత్వ భూమిపై పచ్చ గద్ద ’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన రెవెన్యూ ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించడంతో గురువారం వీఆర్‌ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సర్వే నంబర్ 763లోని భూమిని సర్వే ప్రారంభించారు. మొత్తం 9 ఎకరాలకుపైగా ప్రభుత్వం భూమి ఉండగా.. సర్వే పూర్తికి మరో రెండు రోజులు పడుతుందని వీఆర్‌ఓ చెప్పారు.
ధర పెరగడంతోనే...
సర్వే నంబర్ 763లోని భూముల పక్కనే జాతీయ రహదారి 342 వెళ్తోంది. దీంతో ఈ భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో అక్కడ కొంత మంది టీడీపీ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ, బీజేపీ నాయకులు అడ్డుకోవడం...పచ్చ నేత ఆక్రమణ పర్వాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్పటికప్పుడు అధికారులు భూ ఆక్రమణదారుడిని ఫోన్‌లోనే హెచ్చరించారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల విధుల్లో ఉన్న అధికారులంతా సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. ఈక్రమంలోనే సర్వే నంబర్ 763లోని భూముల ఆక్రమణ అంశాన్ని పరిశీలించి గురువారం నుంచి సర్వే ప్రారంభించారు.
గువ్వలగుట్టపల్లిలో ఆక్రమిత భూమి సర్వే


