ధర్మవరంలో దుశ్చర్య!
ధర్మవరం రూరల్: ఆర్థిక మూలాలు దెబ్బతీయడం.. బాధితులు అక్కడి నుంచి వారికి వారే వెళ్లిపోయేలా చేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో కూటమి పార్టీల్లోని నేతలంతా ఆరితేరారు. నిరుపేద రైతుల భూములను కబ్జా చేస్తూ వారిరి నిలువనీడలేకుండా చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
పచ్చని చెట్లు నరికివేత..
ధర్మవరం మండలం రేగాటిపల్లి పంచాయతీలోని ముచ్చురామి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త, రైతు రామ్మోహన్‌రెడ్డికి చెందిన 180 మామిడి చెట్ల (రెండేళ్ల వయసు)ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. గురువారం సాయంత్రం పొలానికి వెళ్లిన రైతు చెట్లను నరికివేసినట్లు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనసేనకు చెందిన గుర్రప్ప, అచని అనుచరులే చెట్లను నరికివేసి ఉంటారన్న అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి..
40 ఏళ్ల క్రితం రేగాటిపల్లి సొసైటీ భూముల పంపిణీలో భాగంగా రామ్మోహన్‌రెడ్డి కుటుంబానికి అధికారులు రెండున్నర ఎకరాల పొలానికి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి రామ్మోహన్‌రెడ్డి కుటుంబం అందులో పలు రకాల పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే రామ్మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితం హైడెన్‌సిటీ పద్ధతిలో (దగ్గర దగ్గరగా) పొలంలో 500 మామిడి మొక్కలను నాటాడు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేగాటిపల్లికి చెందిన జనసేన నాయకుడు, మాజీ ఎంపీపీ గుర్రప్ప అధికారుల అండతో రామ్మోహన్‌రెడ్డి పొలాన్ని ఆన్‌లైన్‌లో పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమి తనదంటూ గొడవకు దిగారు. ఆరు నెలల క్రితం కూడా ఇదే పొలంలో 80 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. అప్పట్లోనే బాధిత రైతు ధర్మవరం రూరల్ పోలీసులు ఫిర్యాదు చేయగా... వారు పొలంలోకి వచ్చి పరిశీలించారు. పోలీసుల సూచన మేరకు పొలంలో సీసీ కెమెరా కూడా బిగించుకున్నాడు. తాజాగా బుధవారం రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు 180 మామిడి చెట్లు నరికివేశారు. రాత్రి సమయం కావడంతో సీసీ కెమెరాలు సరిగా పనిచేయలేదు. నాలుగు దశాబ్దాలుగా తాను సాగులో ఉన్న భూమిని కబ్జా చేసే క్రమంలోనే జనసేన నాయకులు ఇలా నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు పొలంలోని
180 మామిడి చెట్లు నరికివేత
జనసేన నాయకుల పనే అంటున్న బాధితుడు
గతంలోనూ 80 చెట్లను
నరికి వేశారని ఆవేదన


