చంద్రబాబు హయాంలో వైద్యం దైవాధీనం
రొద్దం: చంద్రబాబు హయాంలో వైద్యం దైవాధీనంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె రొద్దం మండల పరిధిలోని కలిపి గ్రామ పంచాయతీలో పర్యటించారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడం వల్ల జరిగే నష్టాలను వివరించారు. అనంతరం ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన సంతకాల పత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ...వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి...పేదలందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తే...ప్రస్తుత సీఎం చంద్రబాబు వైద్యాన్ని దైవాధీనంగా మార్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయిందన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పేద కుటుంబాల్లోని పిల్లల డాక్టర్ కల నెరవేర్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలకు అనుమతులు తీసుకువచ్చి దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలు ప్రారంభించారన్నారు. అందులో ఏడు కళాశాలలు పూర్తయ్యాయన్నారు. మిగతా వాటిని పూర్తిచేసి పేదలకు మేలు చేయాల్సిన చంద్రబాబు...పీపీపీ పేరుతో మెడికల్ కళాశాలలను తన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా చంద్రబాబు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై మరోసారి ఆలోచించి పేదలకు మేలు చేయాలన్నారు. లేకపోతే ఆయన్ను రాష్ట్ర ప్రజానీకం క్షమించబోదన్నారు.
ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు పెన్నానది నుంచి ఇసుక అక్రమంగా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఉషశ్రీచరణ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు పింఛన్లు ఇస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి సవిత ఎన్నికల వేళ హామీలిచ్చి ఓట్లు దండుకున్నారన్నారు. ఇప్పుడు వాటిపై నోరు మెదపడం లేదన్నారు. సవితకు ఈ ప్రాంత అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెనుకొండ మెడికల్ కళాశాల ప్రైవేటుపరం కాకుండా చూడాలని, లేదంటే ప్రజలు ఆమెను క్షమించబోరన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శివాజీ, ఎంపీటీసీ నగేంద్ర, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అమీర్, ఇస్లాపురం అంజి, స్థానిక నాయకులు రామంద్రారెడ్డి, బాబు, జగనాథ్‌రెడ్డి, రవి, అశోక్‌రెడ్డి, ఏ. మారుతిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, అంజినరెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
కలిపిలో కోటి సంతకాల సేకరణ
చంద్రబాబు హయాంలో వైద్యం దైవాధీనం


