అరటికి గిట్టుబాటు ధర కల్పించండి
● టన్ను రూ.6 వేలకు
తక్కువ కాకుండా కొనండి
అనంతపురం అగ్రికల్చర్: అరటి పంటకు గిట్టుబాటు కల్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం ‘సాక్షి’లో ‘అరటి రైతుల ఆక్రందన’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులతో పాటు అరటి ఎగుమతిదారులతో స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అరటి ధరలు పతనం కావడం, రైతులు నష్టపోతున్న పరిస్థితిపై ఆరా తీశారు. ఎందుకీ పరిస్థితి తలెత్తిందని అధికారులు, ఎగుమతిదారులను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సారి అరటి సాగు పెరగడం, ప్రస్తుతం పంట కోతలు జరుగుతుండటంతో వ్యాపారులు, ఎగుమతిదారులు అటువైపు దృష్టి సారించడం వల్ల సమస్య తలెత్తినట్లు అధికారులతో పాటు ఎగుమతిదారులు తెలిపారు. గల్ఫ్ దేశాలైన ఇరాక్, ఇరాన్ రాష్ట్రాల నుంచి ఆశించిన డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. అక్టోబర్, నవంబర్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా అరటి నాణ్యత తగ్గడంతో ధరలు తగ్గిపోయినట్లు విశ్లేషించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అరటి రైతులను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని సూచించారు. నాణ్యతను బట్టి టన్ను రూ.6 వేల నుంచి రూ.8 వేలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఎగుమతి కంపెనీలు రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏడీ దేవానందకుమార్, మార్కెటింగ్‌శాఖ అధికారులు, ఎగుమతి దారులు పాల్గొన్నారు.


