అప్పు విషయమై ఘర్షణ
ముదిగుబ్బ: వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తోపులాటలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బలోని దొరిగిల్లు రోడ్డులో శాంతమ్మబాయి(55), నరసింహులునాయక్ దంపతులు హోటల్ నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు రమేష్‌నాయక్ ఆర్‌ఎంపీ. రెండేళ్ల కిందట అనంతపురంలో క్లినిక్ నడుపుతున్నపుడు అక్కడ రామకృష్ణ అనే వ్యక్తి వద్ద అధిక వడ్డీకి రూ.30వేలు అప్పు తీసుకున్నాడు. ఏడాది పాటు వడ్డీ చెల్లించాడు. అసలులోకి సగానికి పైగా చెల్లించాడు. ఏడాది కిందట ముదిగుబ్బకు వచ్చేశాడు. తమకు రావాల్సిన డబ్బు చెల్లించాలని రామకృష్ణ ముదిగుబ్బకు వచ్చి ఒత్తిడి చేశాడు. అయితే సమయం కావాలని చెప్పి అడిగారు. ఈ క్రమంలో డబ్బు వసూలు కోసం రామకృష్ణ మరికొంతమందితో కలిసి మంగళవారం రాత్రి అనంతపురం నుంచి ముదిగుబ్బకు వచ్చాడు. ఉన్నపళంగా తమకు డబ్బు కట్టాల్సిందేనని గద్దించాడు. మరికొంత గడువు కావాలని రమేష్‌నాయక్ తల్లిదండ్రులు కోరారు. దీంతో తమకు కానే కావాలంటూ వడ్డీ వ్యాపారి, తదితరులు తోయడంతో శాంతమ్మబాయి, నరసింహులునాయక్ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వీరిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే శాంతమ్మబాయి మృతి చెందినట్లు తేల్చారు. నరసింహులు నాయక్ చికిత్స పొందుతున్నాడు. ఘటన అనంతరం వడ్డీ వ్యాపారులు పరారయ్యారు. రమేష్‌నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వడ్డీ వ్యాపారుల తోపులాటలో మహిళ మృతి
ఆమె భర్తకు తీవ్ర గాయాలు
అప్పు విషయమై ఘర్షణ


