పసికందు అదృశ్యం
ఎన్‌పీకుంట: అమ్మమ్మ ఆశ్రయంలో ఉన్న పసికందు కనిపించడం లేదంటూ పోలీసులకు ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఎన్‌పీకుంటలోని కొత్త బజారుకు చెందిన రాధమ్మ, రెడ్డప్ప దంపతులకు 40 రోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. నెల రోజుల క్రితం పసికందు విషయంలో రాధమ్మ, రెడ్డప్ప మధ్య గొడవ జరిగింది. రాధమ్మకు కాస్త మతిస్థిమితం ఉండటంతో పసికందును బాలల సంరక్షణా విభాగంలో ఉంచారు. వారం రోజుల తరువాత తిరిగి తల్లికి అప్పగించారు. అనంతరం పసికందును తన భార్య తల్లి గంగాదేవికి అప్పగించి వ్యాపార రీత్యా వేరే ఊరికి భార్యతో కలసి రెడ్డప్ప వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రోజూ గంగాదేవి ఇంటిని స్థానిక అంగన్‌వాడీ టీచర్ సందర్శించి, పసికందు బాగోగులపై ఆరా తీస్తుండేది. అయితే పసిపిల్లను తాను పోషించలేనని, తిరిగి బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లాలంటూ గంగాదేవి చెబుతుండేది. నిబంధనలు అనుసరించి పసికందును స్వాధీనం చేసుకుంటామని గంగాదేవికి ఐసీడీఎస్ అధికారులు నచ్చచెప్పారు. బుధవారం ఉదయం అంగన్‌వాడీ కార్యకర్త వెళ్లిన సమయంలో పసికందు కనిపించలేదు. గంగాదేవిని ఆరా తీస్తే పొంతన లేని సమాధానం ఇవ్వడంతో పాటు సమాచారం ఇచ్చేందుకు సహకరించలేదు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ రాధిక, బాలల సంరక్షణా విభాగం జిల్లా అధికారి నాగలక్ష్మి, సూపర్‌వైజర్ నరసమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.
జాతీయ స్థాయి అథ్లెటిక్స్
పోటీలకు ఉపాధ్యాయుడు
రొద్దం: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్(ఏఐసీఎస్) అథ్లెటిక్స్ పోటీలకు రొద్దం మండలం కంచిసముద్రం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నరేష్‌కుమార్ ఎంపికయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ఆయన.. 400 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచారు. త్వరలో బీహార్‌లోని పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న నరేష్‌కుమార్‌ను తోటి ఉపాధ్యాయులు అభినందించారు.
వ్యక్తి దుర్మరణం
శింగనమల(నార్పల): ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొండూరుకు చెందిన శ్రీనివాసులు (37) వ్యక్తిగత పనిపై బుధవారం నార్పలకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై బత్తలపల్లి మీదుగా తిరుగు ప్రయాణమైన ఆయన.. నార్పల మండలం బొందలవాడ వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఓ కుమారుడు ఉన్నాడు. భార్య లేదు. ఘటనపై నార్పల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శతాధిక వృద్ధుడి మృతి
పెనుకొండ రూరల్: మండలంలోని గోనిపేట గ్రామానికి చెందిన గొల్ల అక్కులప్ప (105) వయోభారంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. తుది శ్వాస విడిచే వరకూ ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి పెద్దదిక్కుగా ఉన్న అక్కులప్ప మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గ్రామస్తులు, బంధువుల నడుమ ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించారు.
పసికందు అదృశ్యం
పసికందు అదృశ్యం


