దున్నపోతును ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి
గుమ్మఘట్ట: రోడ్డుకు అడ్డంగా వచ్చిన దున్నపోతును ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన మహేష్ (30), అభి, రాజు ముగ్గురూ ఒకే ద్విచక్ర వాహనంపై బుధవారం బంజయ్యనగర్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం రాత్రి తిరుగు ప్రయాణమైన వారు... గుమ్మఘట్ట మండలం సిరిగెదొడ్డి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా దున్నపోతు వచ్చింది. ఆ సమయంలో వేగాన్ని నియంత్రించుకోలేక నేరుగా వెళ్లి ఢీకొన్నారు. ఘటనలో మహేష్ గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అబి, రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అటుగా వెళుతున్న వారు స్పందించి క్షతగాత్రులను రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మహేష్ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
హిందూపురం: స్థానిక రైల్వే స్టేషన్‌లోని 2వ ప్లాట్‌ఫాంపై ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం వేకువ జాము 1 గంటకు ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన లఖ్వీందర్ సింగ్ (37)గా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


