అటు ఉద్యోగం.. ఇటు వ్యవసాయం
ఓవైపు ల్యాప్ టాప్‌లో వర్క్ చేసుకుంటూ, మరోవైపు పొలం పనులు చేస్తున్న హీరోని మనం మహర్షి సినిమాలో చూశాం. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి రావడంతో పల్లెటూళ్లకు చేరుకున్న రైతు బిడ్డలు తీరిక వేళల్లో పొలంబాట పట్టారు. ఓవైపు ఆఫీసు పని చేసుకుంటూనే, మరోవైపు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అవపోసన పట్టడంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి చూపిస్తున్నారు. ఈ కోవలోనే సోమందేపల్లికి చెందిన యువ రైతు మారుతి నిలిచాడు.
పెనుకొండ: బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలోఉద్యోగం చేస్తున్న సోమందేపల్లికి చెందిన మారుతి పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయంపై మక్కువతో పలువురు రైతుల సూచనలు, సలహాలు పాటిస్తూ రెండు నెలల క్రితం 3 ఎకరాల్లో కళింగర సాగు చేపట్టి.. అందులో అంతర పంటగా బొప్పాయి మొక్కలు నాటాడు. ప్రస్తుతం మరో పది రోజుల్లో కళింగర పంట దిగుబడులు రానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కిలో రూ.30 చొప్పున పంటను విక్రయించేలా బెంగళూరులోని వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాడు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో..
పంటల సాగులో మారుతి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నాడు. కిలో రూ. 40 వేలతో హైదరాబాద్‌లో బన్నీ రకం కళింగర విత్తనం కొనుగోలు చేశారు. అలాగే మహారాష్ట్ర నుంచి పంద్రా రకం బొప్పాయి విత్తనాలు కొనుగోలు చేశాడు. నిపుణుల సలహాలు, సూచనలతో పాటు ఎప్పటికప్పుడు ఆధునికతను అన్వేషిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టాడు. డ్రోన్ సాయంతో క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తుండగా చుట్టుపక్కల రైతులు ఆసక్తిగా గమనించేవారు. రూ. 3 లక్షలు వెచ్చించి సాగు చేసిన పంటల్లో ప్రస్తుతం కళింగర పంట చేతికి రానుంది. పంట కాలం పూర్తయినప్పటి నుంచి మరో మూడు నెలలకు బొప్పాయి దిగుబడులు మొదలు కానున్నాయి. రెండేళ్లపాటు బొప్పాయి పంట చేతికి అందనుంది. మారుతి చేపట్టిన పంటల సాగును గమనించిన బెంగళూరులోని అతని స్నేహితులు కూడా వ్యవసాయంలో దిగారు. దాదాపు 40 ఎకరాల్లో వారు కళంగిరలో అంతర పంటగా బొప్పాయి సాగు చేపట్టారు.
3 ఎకరాల్లో అంతర పంటల సాగు
మరో వైపు కోళ్ల పెంపకం
వ్యవసాయం భారం కాదని నిరూపిస్తున్న
యువ రైతు
వ్యవసాయం అంటే మక్కువ
వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. విభిన్న రకాల పంటలను సాగు చేయాలని అనుకుంటున్నా. గతంలో పూల సాగు చేసి బెంగళూరు, హిందూపురం మార్కెట్లకు తరలించాను. ఇప్పుడు కూడా నాటుకోళ్లు, పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాను. ఇందు కోసం రూ.2 లక్షల ఖర్చుతో ప్రత్యేకంగా షెడ్డు వేయించా. మార్కెట్‌లో కళింగర పంటకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అవసరమనుకున్న వారికి సూచనలు, సలహాలు ఇస్తుంటాను.
అటు ఉద్యోగం.. ఇటు వ్యవసాయం


