23న జిల్లా స్థాయి చెకుముకి పరీక్షలు
కదిరి అర్బన్: చెకుముకి మండల స్థాయి విజేతలకు ఈ నెల 23న పెనుకొండలోని గ్లోబల్ జైన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జిల్లా స్థాయి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు జన విజ్ఙాన వేదిక జిల్లా అధ్యక్షుడు నరసారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా స్థాయి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
అధిక మోతాదులో మందులు మింగి
వృద్ధుడి మృతి
శెట్టూరు: మండల కేంద్రానికి చెందిన బోయ రామాంజనేయులు(74) అధిక మోతాదులో మందులు మింగి మృతి చెందాడు. ఐదేళ్లుగా బీపీ, షుగర్‌తో పాటు మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యుడు ఇచ్చిన మందులను మంగళవారం రాత్రి మింగిన కాసేపటికే పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక బుధవారం ఆయన మృతి చెందాడు. మృతుడి కుమారుడు చంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తల్లిపై కొడుకు కత్తితో దాడి
గార్లదిన్నె: మండలంలోని కల్లూరులో షేక్ మాబున్నీపై బుధవారం ఆమె కుమారుడు దూద్‌వలి కత్తితో దాడి చేశాడు. తన పేరున ఇల్లు రాసివ్వలేదని ఆగ్రహంతో కత్తితో దాడి చేయడంతో మాబున్నీ ఎడమ చేతిపై తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబసభ్యులు అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అండర్ –14 క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే ఎస్‌జీఎఫ్ అండర్–14 రాష్ట్ర స్థాయి బేస్‌బాల్, వాలీబాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక బుధవారం జరిగింది. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చేపట్టిన ఈ ప్రక్రియను ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని పర్యవేక్షించారు. ఎంపికై న వాలీబాల్ బాలుర జట్టులో చరణ్ నాయక్, మోహన్, శ్రీకాంత్, మణికంఠ, సాకేత్, బాబాఫకృద్దీన్, అఖిల్‌సాయి, భరత్, ముఖేష్, స్కంద, చరణ్, దీరజ్ రెడ్డి ఉన్నారు. బాలిక జట్టులో నిహారిక, అఫ్రీన్, మోక్షిత, అమీనా, అవంతి, శరణ్య, తస్మియా, సింధు, వర్షిత, లావణ్య, చైత్ర, హర్షిత చోటు దక్కించుకున్నారు. అలాగే బేస్‌బాల్ బాలిక జట్టుకు స్వాతి, లాస్య, అను, స్వాతి, ఇంతియాజ్, లిఖిత, పూజిత, సౌమ్యశ్రీ, ఝాన్సీ, మౌనిక, లోకేశ్వరి, అప్సనా, శ్రీలత, విజయలక్ష్మి, అక్షయ, పవిత్ర ఎంపిక కాగా, బాలుర జట్టులో రాకేష్, గోకుల్, వరుణ్, కసి నాయక్, అశోక్ చక్రవర్తి, వరుణ్‌కుమార్, రోహిత్‌కుమార్, చరణ్ నాయక్, బద్రీనాథ్, చైతన్యకుమార్, నరేష్, హర్షవర్ధన్, సంతోష్, అరుణ్, బన్నీ, చేతన్‌రెడ్డి, సాఫ్ట్‌బాల్ బాలుర జట్టులో సందీప్, రాజు, వెంకటేష్, ఉమేష్‌చంద్ర, చైతన్య, నితిన్‌నాని, శివప్రసాద్, హరిసాత్విక్, ప్రవీణ్, భానుప్రభాస్, సాకేత్, ఓంకార్, శివ సంజయ్, మారుతి, అభిరామ్ చోటు దక్కించుకున్నారు.
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో
ఉచిత పశు వైద్య శిబిరం
రాప్తాడు రూరల్: సత్యసాయి జయంతిని పురస్కరించుకుని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం రూరల్ మండలం కందుకూరులో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సత్యసాయి భక్తుడు, విశ్రాంత పశువైద్యుడు డాక్టర్ పున్నయ్య ఈ వైద్య శిబిరానికి అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేశారు. శిబిరాన్ని పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ ప్రేమ్‌చంద్ ప్రారంభించి, మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద పాడి రైతులు అర ఎకరాలో పశుగ్రాసం సాగు చేసుకునేందుకు వీలుగా చేయూతనిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సాగు ఖర్చులకు రూ.32 వేలు ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అనంతరం 500 గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించారు. గోమార్లు, పిడుదులతో బాధపడుతున్న ఆవులకు నివారణ మందును స్ప్రే చేయించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నరసింహప్ప, భక్తులు తిరుపాలు, చెన్నకేశవులు, పశుసంవర్ధక శాఖ అనంతపురం డివిజన్ ఉపసంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి, శింగనమల ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ పద్మనాభం, కాటిగానికాలువ, కందుకూరు పశు వైద్యాధికారులు డాక్టర్ మహేష్, డాక్టర్ ఉషా, సిబ్బంది, పశు వైద్య సహాయకులు వినీత్, మాధవరాజు, సాదిక్ పీరా, షఫీ, ఫయాజ్, యశోద, జ్యోతి, బాబు నాయుడు పాల్గొన్నారు.


