గాండ్లపెంట: జిల్లాలో నీలి నాలుక వ్యాధి విస్తరిస్తోంది. మందలోని గొర్రెలకు నోటి పుండు (నీలి నాలుక), బొబ్బ, పారుడు... ఇలా వ్యాధులు సోకుతున్నాయి. వ్యాధి సోకిన గొర్రెలు చొంగ కార్చడం, మేత మేయకపోవడం బలహీనంగా మారి శరీరంపై బొబ్బలు వచ్చి ఉన్నఫళంగా మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. గాండ్లపెంట మండల వ్యాప్తంగా గొర్రెలు, మేకలు 1,02000 వరకు ఉన్నాయి. పశువైద్యశాలకు వెళ్లి వ్యాధి తీవ్రత తెలిపి మందులు కావాలని అడిగితే వైద్యాధికారులు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో బయట ప్రైవేట్‌గా మందులు కొనుగోలుకు రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందని, అయినా జీవాలను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందులు ఇవ్వమంటున్నారు
గొర్రెలకు నోటి పుండు వ్యాధి సోకింది. పశువైద్యశాలకు వెళితే మందులు ఇవ్వమంటున్నారు. దీంతో ప్రైవేటు మందుల దుకాణంలో కొని గొర్రెలకు వేశాను. అయినా రెండు గొర్రెలు చనిపోయాయి. మరో రెండు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. వ్యవసాయం వదిలి గొర్రెల పెంపకం చేపట్టినా నష్టాలు తప్పడం లేదు. – బ్రహ్మానందరెడ్డి,
తాళ్లకాల్వ, గాండ్లపెంట మండలం
మందులు బయటికి ఇవ్వం
గొర్రెలకు నీలినాలుక వ్యాధి వ్యాపిస్తున్న మాట వాస్తవం. నివారణకు సాయంత్రం వేళ మందలో వేపాకు పొగ వేయాలి. వ్యాధి సోకిన గొర్రెలకు గ్లిజరిన్, మెలాక్సికాం మందు, పొటాషియం పర్మాంగనేట్ మందును పూయాలి. పై మందులు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి. జీవాలను పశు వైద్యశాలకు తోలుకొస్తే మందులు ఇస్తాం. బయటకు ఇవ్వడం కుదరదు. – డాక్టర్ కేశవనాయక్,
పశువైద్యాధికారి, గాండ్లపెంట
రూ.10 వేలు అయింది
వ్యవసాయం వదిలి 100 గొర్రెల పెంపకం చేట్టాను. నీలినాలుక వ్యాధి సోకి గొర్రెలు చనిపోతున్నాయి. ఆస్పత్రిలో మందులు లేవన్నారు. దీంతో ఇప్పటి వరకూ రూ.10 వేలు మందుల కోసం ఖర్చు పెట్టాను. ఇప్పటికే రెండు గొర్రెలు చనిపోయాయి. మరో మూడు పూర్తి అస్వస్థతతో ఉన్నాయి.
– లీలానందరెడ్డి, ఎలుగూటివారిపల్లి,
గాండ్లపెంట మండలం
మందులు లేవంటున్న పశువైద్యులు
మృత్యువాత పడుతున్న గొర్రెలు
నష్టపోతున్న రైతులు
విస్తరిస్తున్న నీలి నాలుక
విస్తరిస్తున్న నీలి నాలుక
విస్తరిస్తున్న నీలి నాలుక


