భారత బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: భారత బాల్ బ్యాడ్మింటన్ జట్టులో జిల్లాకు చెందిన మందాల పావని చోటు దక్కించుకుంది. ఈ మేరకు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వై రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు తమిళనాడులోని దిండిగల్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పావని ప్రతిభ కనబర్చి భారత ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికై ంది. అక్కడ కూడా రాణించడంతో ప్రధాన జట్టులో స్థానాన్ని దక్కించుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు నేపాల్ రాజధాని ఖాట్మాండు వేదికగా జరిగే అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆమె ప్రాతినిథ్యం వహించనుంది. కాగా, మందాల పావని స్వగ్రామం తాడిమర్రి మండలం ఆత్మకూరు. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వీరప్ప, శివమ్మ. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తెస్తానని అన్నారు. తన ఎదుగుదలకు బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ అందించిన సహకారం మరువలేనన్నారు. పావని ఎంపికపై బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, కార్యదర్శి వెంకటేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


