మహిళకు 14 నెలల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

మహిళకు 14 నెలల జైలు శిక్ష

Nov 19 2025 5:33 AM | Updated on Nov 19 2025 5:33 AM

మహిళక

మహిళకు 14 నెలల జైలు శిక్ష

ధర్మవరం అర్బన్‌: తహసీల్దార్‌ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పాస్‌బుక్‌లో సర్వే నంబర్లు, భూమి ఎకరాల నంబర్లు ఫోర్జరీ చేసిన కేసులో మహిళకు 14 నెలల జైలు శిక్షను విధిస్తూ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.వెంకట హరీష్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు. వన్‌టౌన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ రెడ్డెప్ప వివరాల మేరకు.. 2017 సంవత్సరంలో ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి సాలమ్మ అప్పటి తహసీల్దార్‌ మహబూబ్‌బాషా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకంలో సర్వేనంబర్లు, భూమి ఎకరాల్లో తేడాలను ఫోర్జరీ చేసింది. దీంతో అప్పటి తహసీల్దార్‌ మహబూబ్‌బాషా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాటి ఎస్‌ఐ బీఎన్‌ సురేష్‌ (ప్రస్తుతం పుట్టపర్తి రూరల్‌ సీఐ) కేసు నమోదు చేశారు. 342, 353, 455, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీపీ ఆదినారాయణమ్మ, కోర్టు కానిస్టేబుల్‌ రాము కేసును పర్యవేక్షించారు. జులై నెలలో దాసరి సాలమ్మకు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు రావడంతో అప్పుడు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె జైలులో ఉంది. అప్పటి తహసీల్దార్‌ మహబూబ్‌బాషా, అప్పటి ఎస్‌ఐ సురేష్‌లను విచారించిన అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట హరీష్‌ మహిళ సాలమ్మకు 14నెలల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించినట్లు ఇన్‌చార్జ్‌ సీఐ రెడ్డెప్ప తెలిపారు.

జగన్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

రాప్తాడు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమారై మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్‌రెడ్డి వివాహానికి వైఎస్‌ జగన్‌ హాజరయ్యే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం 44వ జాతీయ రహదారిపై హెచ్‌పీ పెట్రోలు బంక్‌ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపం, గంగలకుంట రోడ్డులో సిద్ధం సభకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ స్థలం, లింగనపల్లి రోడ్డులో బొమ్మేపర్తి సచ్చిదానంద స్వామి ప్రవేశ ద్వారం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని జగన్‌ కార్యక్రమాల కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. వివాహ మహోత్సవానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేసులు, సీఐ శ్రీహర్షతో నేతలు చర్చించారు.

ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

కళ్యాణదుర్గం రూరల్‌: ఆర్థిక సమస్యలు తాళలేక లక్షన్న (60) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవార చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన లక్ష్మన్న, నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల లక్ష్మన్న కుటుంబ పోషణ కోసం రూ.5 లక్షలు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గంలేక మనోవేదనతో గ్రామ సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఉరివేసుకొని మరొకరు..

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని ఓ యుడకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. శింగనమలకు చెందిన తిరుమలేసు (41) సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు. రోజంతా పేపర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు సేకరించగా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. అశోక్‌నగర్‌లోని గుజిరి షాపులోనే ఉంటున్నాడు. మనస్థాపంతో సోమవారం రాత్రి ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రొఫెసర్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు

గుత్తి: గుత్తికి చెందిన డాక్టర్‌ ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన ఘటనలో ఆమె భర్త, ప్రొఫెసర్‌ ధనుంజయ కుమార్‌, ఆయన తల్లిదండ్రులు నాగేశం, రామ తులసిపై మంగళవారం రాత్రి వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అనంతపురానికి చెందిన ధనుంజయ కుమార్‌, గుత్తికి చెందిన డాక్టర్‌ ప్రియాంకను 2022లో వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతనితో పాటు ఆయన తల్లిదండ్రులు ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. రెండు రోజులు క్రితం ప్రియాంక వరకట్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

పాముకాటుతో రైతు మృతి

శెట్టూరు: మండలంలోని కై రేవుకు చెందిన రైతు కురుబ ఈరన్న (74) పొలంలో పాముకాటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మూడు రోజుల క్రితం ఈరన్న తన పొలంలోని మామిడి మొక్కల్లో కలుపు మొక్కలు తొలగిస్తున్నాడు. అంతలో ఏదో పాము కుడి చేతి వేలిని కుట్టింది. ఈరన్న పెద్దగా పంటిచుకోలేదు. రెండోరోజు చేయి మొత్తం పెద్ద వాపురావడంతో కుటుంబ సభ్యులు విచారించారు. అప్పుడు విషయాన్ని వారికి చెప్పడంతో వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈరన్న మృతి చెందాడు. మృతుడి కుమారుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళకు 14 నెలల జైలు శిక్ష 1
1/1

మహిళకు 14 నెలల జైలు శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement