ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు సర్వీసులు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. గురువారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా పలు రైళ్ల రాకపోకలను ప్రశాంతి నిలయం మీదుగా మళ్లించారు. దీంతో తొలి రైలు (యశ్వంత్‌పూర్ నుంచి రుషికేష్‌కు) గురువారం ప్రశాంతి నిలయానికి చేరుకుంది. వందలాది మంది సత్యసాయి భక్తులు విచ్చేశారు. రెండు నిమిషాల పాటు స్టేషన్‌లో రైలు ఆగింది. 14న 11 రైళ్లు, 15న 13 రైళ్లు, 16న 15 రైళ్ల రాకపోకలు ఉంటాయని స్టేషన్ మేనేజర్ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ వరూ మొత్తం 334 రైళ్ల రాకపోకలు ఉంటాయని వివరించారు. కాగా, ఇటీవల ఢిల్లీలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పుట్టపర్తి రైల్వేస్టేషన్‌లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రత్యేక సాయుధ దళాలతో పాటు స్థానిక రైల్వే పోలీసులు పహారా కాస్తున్నారు.
7 మెగా వైద్య శిబిరాలు..
7 అంబులెన్స్‌లు
● బాబా శత జయంత్యుత్సవాల్లో
వైద్యఆరోగ్యశాఖ సేవలు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లతో పాటు ప్రశాంతి నిలయంలో 7 చోట్ల మెగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం తెలిపారు. అలాగే 29 చోట్ల వైద్య సిబ్బంది, అధికారులను అందుబాటులో ఉంచామన్నారు. ఉత్సవాలు ముగిసే వరకూ ఏడు 108 వాహనాలను అందుబాటులో ఉంచుతామని ఆమె వెల్లడించారు. ఈ మేరకు గురువారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...బాబా శత జయంతి ఉత్సవాలకు రద్దీకి తగినట్లుగా ఉచిత మందులు, టాబ్లెట్లు, ఐవీ ఫ్లూయీడ్స్, ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచామన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా శిబిరాల్లో వైద్యం చేయించుకోవచ్చన్నారు. సమీక్షలో డీఐఓ సురేష్‌బాబు, డాక్టర్ నాగేంద్ర నాయక్, డాక్టర్ సునీల్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
● ‘ప్రజా ఉద్యమం’ విజయవంతంపై
ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయ కర్త ఉషశ్రీ చరణ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా ఆరోగ్య భద్రత కోసం తలపెట్టిన ప్రజాఉద్యమం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతమైందన్నారు. ప్రతి చోట ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, పేద విద్యార్థుల వైద్య కలను దూరం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ప్రజా మద్దతుతో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు.
ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు సర్వీసులు
ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు సర్వీసులు


