కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు
పుట్టపర్తి టౌన్: సత్యసాయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో భద్రతా పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూంలో విధులు నిర్వహించే సిబ్బందికి గురువారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ హాజరై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 176 సీసీ కెమెరాలు, 8 డ్రోన్లు విజువల్స్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామని, సుమారు 100 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా విధుల్లో ఉంటారని వారు తెలిపారు.
నైట్ డ్రోన్లు.. మ్యాల్రిక్స్ కెమెరాలు
ప్రశాంతి నిలయంతో పాటు పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహవీర్‌తో కలిసి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌హాలు, హిల్‌వ్యూ స్టేడియం పార్కింగ్ ప్రదేశాలు, చెక్‌పోస్టులను పరిశీలించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, 22, 23వ తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి విచ్చేయనున్న నేపఽథ్యంలో నైట్ డ్రోన్లు, మ్యాల్రిక్ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.


