ఇమామ్.. సలామ్
● ప్రజాసేవే లక్ష్యంగా నిస్వార్థంగా శ్రమించిన యోధులు
● సన్మాన సభలో కొనియాడిన సజ్జల, పెద్దిరెడ్డి తదితరులు
తిరుపతి సిటీ: మెరుగైన సమాజం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి అడుగులు వేసిన గొప్ప వ్యక్తి ఇమామ్ అని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. సామాజిక వేత్తగా, రాయలసీమ దాహార్తిని తీర్చేందుకు అహర్నిశలు శ్రమించిన యోధునిగా ఇమామ్ జీవన విధానం, సేవలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి రూపొందించిన ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్కకావిష్కరణ శనివారం తిరుపతి పద్మావతి పురంలోని అన్నమయ్య భవన్‌లో శ్వేత డైరెక్టర్ భూమన్ సుబ్రమణ్యం రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సజ్జల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులతో కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సజ్జల మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నేత వైఎస్సార్ అని అన్నారు. ఆయన బాటలో మాజీ సీఎం వైఎస్ జగన్ నడుస్తున్నారన్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చారని, అలాగే రూ.వేల కోట్లు వెచ్చించి ఆరోగ్యశ్రీతో పేదల ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఇమామ్ 77 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల నవ యువకుడిలా ఉత్సాహంగా కొత్త ఆలోచనతో ఉండడం అభినందనీయమన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇమామ్‌తో తనకు సుదీర్ఘ పరిచయం ఉందని, రాయలసీమ అభివృద్ధి కోసం వైఎస్సార్‌తో పయనించారని అన్నారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం నుంచి వచ్చి సమాజం పట్ల బాధ్యతగా, తరిమెళ్ల నాగిరెడ్డి అనుచరుడిగా సమాజ మార్పునకు కృషి చేసిన మహనీయులు ఇమామ్ అని కొనియాడారు. ఇమామ్‌తో తనకు సుదీర్ఘ పరిచయం ఉందని, 21 నెలలు ఆయనతో పాటు జైల్లో గడిపిన క్షణాలు గుర్తున్నాయన్నారు. రాజకీయం అంటే ఇతరులతో సంఘర్షణ కాదు.. ఆత్మీయతతో మెలగడం అనే భావన ఇమామ్‌లో కనపడుతుందన్నారు. ఇమామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప విజన్ ఉన్న ప్రజానాయకుడని కొనియాడారు. వెలుగొండ, తెలుగుగంగ, హంద్రీ– నీవా, గాలేరు– నగరితో పాటు ఎన్నో రాయలసీమ ప్రాజెక్టుల నుంచి గ్రేటర్ రాయలసీమ పోరాటం వరకు వైఎస్సార్‌తో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నారాయణస్వామి, ఆర్‌కే రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమామ్ దంపతులను ఘనంగా సత్కరించారు.


