పంటలను సూపర్ చెక్ చేసిన డీఏఓ
పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్‌లో సాగు చేసిన కంది, వరి పంటలను సూపర్ చెక్ చేయడానికి జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ పలు గ్రామాల్లో పర్యటించారు. శనివారం మండల పరిధిలోని బత్తలపల్లి, గువ్వలగుట్టపల్లి, పెడపల్లి గ్రామాల్లోని పంటలను పరిశీలించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను సక్రమంగా ఈ–క్రాప్ బుకింగ్ చేశారా, లేదా? పంటలు సాగయ్యాయా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంటలను పరిశీలించి రికార్డులను పరిశీలించారు. ఏఏ ఎరువులు వినియోగించారు, ఎంత మోతాదులో వినియోగించారు అనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
అధి ధరలకు అమ్మకూడదు
రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలతో పాటు ఎరువుల అంగళ్లలో ఎరువులను అధిక ధరలకు విక్రయించకూడదని డీఏఓ రామునాయక్ హెచ్చరించారు. పెడపల్లిలోని సహకార సంఘం, ఆర్‌ఎస్‌కే, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. ఎక్కడైనా పురుగు మందులు, ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ నాయక్, ఆర్‌ఎస్‌కే సిబ్బంది ధనుంజయ సిబ్బంది పాల్గొన్నారు.
గుప్తనిధుల వేటగాళ్లపై కేసు నమోదు
ఎన్‌పీకుంట: గుప్తనిధుల వేటగాళ్లపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ కిషోర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ధనియానిచెరువు గ్రామం డీ.గొల్లపల్లి సమీపంలోని పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఎం.శ్రీధర్, బి.శవికుమార్, కె.దిలీప్ కుమార్‌రెడ్డి పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని విచారించగా ఆటో, ద్విచక్ర వాహనంలో మొత్తం 7 మంది వచ్చారని ఏఎస్‌ఐ తెలిపారు. వారిలో పెద్దమండ్యంకు చెందిన రేవతి అనే మహిళ కూడా ఉందన్నారు. పట్టుబడిన ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.


