 
															నెగ్గిన అవిశ్వాసం
రొళ్ల: ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీలు నాగరాజు, రత్నమ్మపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో వారు ముగ్గురూ పదవులు కోల్పోయారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీల తీరును నిరసిస్తూ 8 మంది ఎంపీటీసీలు ఈనెల 8వ తేదీన కలెక్టర్, జెడ్పీ సీఈఓను కలిసి అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సభ్యుల విన్నపాన్ని మన్నించిన కలెక్టర్.. ఈ నెల 28వ తేదీన మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించేలా ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌ను ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియమించారు. దీంతో ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులకు ఈ నెల 14వ తేదీనే సమాచారం ఇచ్చారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీలు నాగరాజు, రత్నమ్మ గైర్హాజరు కాగా, మిగతా 8 మంది హాజరయ్యారు. పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించగా... అవిశ్వాస తీర్మానానికి 8 మంది మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీఓ ఆనంద్‌కుమార్ ప్రకటించారు. తదుపరి నివేదికలను జెడ్పీ సీఈఓకు పంపిస్తామన్నారు. కొత్త ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందన్నారు. ఇక అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరం ఎదుట అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ వీరాంజనేయులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఏఓ ప్రసాద్, ఏఎస్‌ఐలు ఇదాయతుల్లా, బషీర్, జమేదార్ రామలింగయ్య, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
రొళ్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై సభ్యుల తిరుగుబాటు
ఈనెల 8వ తేదీనే
అవిశ్వాస తీర్మాన నోటీసు
బుధవారం జరిగిన సభలో
8 మంది అవిశ్వాసానికి మద్దతు
పదవులు కోల్పోయిన
ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీలు నాగరాజు, రత్నమ్మ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
