పట్టుకోండి.. చూద్దాం! | - | Sakshi
Sakshi News home page

పట్టుకోండి.. చూద్దాం!

Oct 30 2025 7:37 AM | Updated on Oct 30 2025 7:37 AM

పట్టుకోండి.. చూద్దాం!

పట్టుకోండి.. చూద్దాం!

సాక్షి, పుట్టపర్తి

జిల్లా కేంద్రం పుట్టపర్తిలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఏకంగా పోలీసులకే సవాల్‌ విసురుతూ చేతివాటం చూపుతున్నారు. శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సమీపంలో రూములు అద్దెకు తీసుకుని.. నెలల తరబడి మకాం వేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇళ్లలో దూరి ఉన్నదంతా దోచుకెళ్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్నా... పోలీసులు నిద్రమేల్కోకపోవడంతో... ప్రశాంతి గ్రామ్‌, జానకి రామయ్య కాలనీల్లో వారానికి ఒక చోరీ వెలుగు చూస్తోంది.

అద్దెరూముల్లో ఉంటూ హస్తలాఘవం..

పుట్టపర్తిలో చోరీలు చేసే వ్యక్తులందరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది. శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చామంటూ అక్కడే రూములు అద్దెకు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పక్కాగా రెక్కీ చేసి రంగంలోకి దిగుతున్నారు. ఎక్కువగా జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరంలోని జానకిరామయ్య కాలనీలోనే చోరీలు జరుగుతున్నాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలం ఎక్కువ ఉండటం.. ఏ ఇంట్లో చొరబడినా.. బయటికి రావడం సులువు కావడంతో దొంగలు ఎక్కువగా ఆ కాలనీ పైనే కన్నేశారు. ఇక ఆస్పత్రి వచ్చే రోగులు, వారి బంధువులు రోడ్డుపై బైక్‌ పార్క్‌ చేస్తే చాలు...క్షణాల్లో మాయం చేస్తున్నారు. చిల్లర దుకాణాలు, హోటళ్ల వద్ద టిఫిన్‌ తిని, టీ తాగి వచ్చే లోపు బైక్‌లు ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కలెక్టర్‌ బంగ్లాతో పాటు చుట్టుపక్కల బ్లాక్‌లలో కూడా భారీ చోరీలు వెలుగు చూశాయి. బంగారం ధరించి రోడ్డుపై వెళ్తున్నా...ఠక్కున లాక్కుని మాయం అవుతున్నారు.

పర్యవేక్షణ లేకపోవడంతో..

శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జానకిరామయ్య కాలనీలో వందకు పైగా చోరీలు జరిగాయి. చోరీలతో పాటు దారి దోపిడీలు, మద్యం మత్తులో గొడవలు, భూదందాలకు జానకి రామయ్య కాలనీ కేంద్రంగా నిలిచింది.

● 2024లో ఏకంగా కలెక్టర్‌ బంగ్లాలో దొంగలు పడిన సంగతి తెలిసిందే.

● ఈ ఏడాదిలో అదే పరిసరాల్లో ఏకకాలంలో 9 ఇళ్లలో చోరీ చేశారు.

● వారం రోజుల క్రితం మూడిళ్లలో చోరీ జరిగింది.

● అంతకుముందు పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చొరబడి మొబైల్‌ ఎత్తుకెళ్లారు.

● ఆస్పత్రికి వెళ్లి వచ్చే లోపు ఓ బైక్‌ మాయమైంది.

● ఓ దుకాణ నిర్వాహకుడు తన వాహనం పక్కనే పార్కింగ్‌ చేసుకున్నప్పటికీ.. పట్టపగలే మాయం చేశారు. ఇందులో చాలా కేసులు నమోదు కాలేదు. ఇంకొన్ని రికవరీ కాలేదు. పోలీసుల పర్యవేక్షణ లేకనే.. చోరీలు విపరీతంగా జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

పోలీసులకు దొంగల సవాల్‌

పుట్టపర్తిలో పెరిగిన చోరీలు

జానకి రామయ్య కాలనీలో అధికం

తాళం వేసిన ఇళ్లను

టార్గెట్‌ చేసిన దొంగలు

చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement