అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని పుట్టపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పుట్టపర్తి డీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు. ఇటీవల కాలంలో పుట్టపర్తి, కొత్తచెరువు బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో వరుస చోరీలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేసుల దర్యాప్తును ప్రతిష్టాత్మంకగా తీసుకున్న పోలీసులు.. ఆయా ఇళ్లలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించారు. వీరిలో ఒకరు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురం గ్రామానికి చెందిన వేణుగోపాలరెడ్డి, మరొకరు అదే మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన ఆదెమ్మ, ఓ బాలుడు ఉన్నట్లుగా నిర్ధారించుకుని ఈ నెల 28న ఉదయం 11 గంటలకు కొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 తులాల బంగారం, 1,250 గ్రాముల వెండి, బైకు, కారు, 5 సెల్‌ఫోన్లు, రెండు ఇనుపరాడ్లు, 3 స్క్రూడ్రైవర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు పుట్టపర్తి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ చోరీలకు పాల్పడేవారని నిర్ధారణ అయింది. ఆదెమ్మతో వేణుగోపాలరెడ్డి సహజీవనం సాగించేవాడు. ఈ క్రమంలో జల్సాలకు దొంగతనాలకు తెరలేపారు. విజయవాడ, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, హైదరాబాదు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినందుకు వేణుగోపాలరెడ్డిపై 11 కేసులు ఉన్నాయి. ఇటీవల గంజాయి విక్రయిస్తూ ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో రిమాండ్‌కు వెళ్లిన బెయిల్‌పై బయటకు వచ్చిన వారు పుట్టపర్తికి శాశ్వతంగా మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన కొత్తచెరువు సీఐ మారుతీశంకర్, ఎస్‌ఐ సతీష్‌కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
నిందితులు ప్రకాశం జిల్లా వాసులు


