రైతుల కన్నీళ్లు తుడవండి
అనంతపురం టవర్‌క్లాక్: రైతుల కన్నీళ్లకు కారకులు కాకుండా వారి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ ఎక్కువ మేలు చేసేందుకే ప్రయత్నించాలని వ్యవసాయాధికారులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశించారు. జెడ్పీ స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7 సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన బుధవారం జరిగాయి. డి.హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యురాలు హెచ్.హసీనాభాను, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ మహేశ్ వేదికపై ఆశీనులయ్యారు. ముందుగా జెడ్పీ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డెప్పరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం చర్చను కొనసాగించారు. వ్యవసాయ శాఖ ప్రగతిని జేడీఏ ఉమామహేశ్వరమ్మ వివరిస్తుండగా బీకేఎస్ జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్ అడ్డుకున్నారు. నాసిరకం పప్పుశనగ విత్తనం కారణంగా యల్లనూరు, పుట్లూరు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మఘట్ట మహేష్ మాట్లాడుతూ.. నిబంధన మేరకు ఈ నెల 15లోపు రైతులకు పప్పుశనగ విత్తనం ఎందుకు సరఫరా చేయలేకపోయారని నిలదీశారు. తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టం అంచనాలు వేయాలని రైతులు కోరినా అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ గిరిజమ్మ మండిపడ్డారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం వీడాలని హితవు పలికారు.
వెలుగు సీసీల మార్పుపై నిలదీత
రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం విధించినా పుట్టపర్తి నియోజకవర్గంలో మాత్రం 12 మంది వెలుగు సీసీలను బదిలీ చేశారని, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ శ్రీసత్యసాయి జిల్లా డీఆర్‌డీఏ పీడీ నరసయ్యను జెడ్పీ చైర్‌పర్సన్ ప్రశ్నించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఒత్తిడి మేరకే సీసీలను బదిలీ చేసే కుట్ర జరుగుతోందని సభ్యులు ధ్వజమెత్తారు. టీడీపీ నేత ఆదేశాలతో ఇలా చేయడం సబబు కాదని పీడీకి హితవు పలికారు.
ఐసీడీఎస్ పీడీ గైర్హాజరుపై మండిపాటు
మూడు నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీ ప్రమీల.. జెడ్పీ సమావేశానికి గైర్హాజరు కావడంపై డి.హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యురాలు హసీనా భాను అసహనం వ్యక్తం చేశారు. ఆమె బాధ్యతారాహిత్యంపై విమర్శలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఐసీడీఎస్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని, రోజూ పత్రికల్లో పతాక స్థాయిలో కథనాలు వెలువడుతున్నా మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. దీంతో సమావేశానికి గైర్హాజరైన పీడీ ప్రమీలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అక్కడే ఉన్న జెడ్పీ సీఈఓ శివశంకర్‌ను చైర్‌పర్సన్ ఆదేశించారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశం
స్థాయీ సంఘం సమావేశంలో వ్యవసాయాధికారులపై ఆగ్రహం
ఐసీడీఎస్ పీడీ ప్రమీలకు షోకాజ్ జారీ చేయాలని సీఈఓకు ఆదేశం
పింఛన్ల పంపిణీలో కోతపై ఆగ్రహం
గత ప్రభుత్వంలో ఎంత మంది అర్హులుంటే అంతమందికీ పింఛన్ల లబ్ధి చేకూరిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో కోతలు పెట్టడం దారుణమని జెడ్పీటీసీ చంద్రకుమార్ అసహనం వ్యక్తం చేశారు.
బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. ఇప్పుడు ఒకరికి పింఛన్ ఇవ్వాలంటే మరొకరు చావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసహాయులపై మానవత్వం చూపాలని అధికారులకు సూచించారు. డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్ము పక్కదారి పడుతోందంటూ తరచూ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. డీఆర్‌డీఏ పీడీ శైలజ స్పందిస్తూ అక్రమాలు వాస్తవమేనని అంగీకరించారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఎందుకు తగ్గిపోతున్నారని, సున్నా వడ్డీ ఎందుకు ఇవ్వడం లేదని చంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు పీడీ సమాధానం ఇవ్వలేకపోయారు.
శిశుగృహ దోషులను వదిలేస్తారా?
శిశుగృహలో శిశువు మృతి అంశంలో దోషులను ఎలా వదిలిపెట్టారంటూ జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, జెడ్పీటీసీ హసీనాభాను ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని ఐసీడీఎస్ పీడీ నాగమణిని సస్పెండ్ చేసి, అసలైన దోషులపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ అరుణకుమారి స్పందిస్తూ.. షోకాజ్ నోటీసులకు శిశుగృహ సిబ్బంది సమాధానం ఇచ్చారని, వాటిని కలెక్టర్‌కు పంపి, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


