పేద ఖైదీలకు ఉచిత న్యాయ సాయం
ముత్యాలమ్మ ఆలయంలో చోరీ
రామగిరి: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తున్న రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు చొరబడి హుండీలోని భక్తుల కానుకలను అపహరించారు. ఆలయం తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న మూడు హుండీల్లో ఒకదానిని సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లి ధ్వంసం చేశారు. అందులో ఉన్న రూ.2 లక్షలకు పైగా నగదు అపహరించారు. బుధవారం ఉదయం ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంను రంగంలో దింపి నిందితుల వేలి ముద్రలను సేకరించే ప్రయత్నం చేపట్టారు. కాగా, ఆలయంలో విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులకు ఆలయ ఈఓ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుధాకరయాదవ్ తెలిపారు.
హిందూపురం: న్యాయవాదులను కూడా నియమించుకోలేని స్థితిలో ఉన్న పేద ఖైదీలకు న్యాయ సాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడారు. ఏ కేసులో జైలుకు వచ్చారు...న్యాయవాదులను నియమించుకున్నారా...జైలులో వైద్య సేవలు అందుతున్నాయా... అని అడిగి తెలుసుకున్నారు. అలాగే సబ్‌జైలు సిబ్బంది ప్రవర్తన గురించి ఆరా తీశారు. బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేక కొందరు విడుదల కాలేకపోతున్నారని సబ్‌జైలర్ హనుమన్న న్యాయమూర్తికి తెలియజేశారు. దీనిపై విచారిస్తానని ఆయన చెప్పారు. న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని రిమాండ్ ఖైదీలు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి త్వరితగతిన న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జైలులోని నిత్యవసరాలను తనిఖీ చేశారు. తర్వాత వంటగది, ఉచిత న్యాయ సహాయ గది, ఫిర్యాదుల పెట్టె, శుద్ధ జల ప్లాంట్ తదితర వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాది పార్వతి, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, రాజు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్


