బాలింత మృతిపై విచారణ
హిందూపురం టౌన్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో 8 నెలల క్రితం అధిక రక్తస్రావంతో బాలింత ప్రీతి మృతి చెందిన అంశంపై బుధవారం ప్రత్యేక వైద్యుల బృందం విచారణ చేపట్టింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రీతి మృతి చెందినట్లు ఆరోపిస్తూ జిల్లా ఉన్నతాధికారులకు ఆమె భర్త హరి, బంధువులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో విచారణకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. దీంతో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర ప్రాంతాలకు చెందిన వైద్యులు బృందంగా ఏర్పడి బుధవారం ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్ నీరజతో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని విచారణ చేశారు. ప్రీతికి అందించిన చికిత్సల రికార్డులను పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఓటీపీ తెచ్చిన తంటా
●ఈ–కేవైసీ అప్‌డేట్ కోసం మహిళా పోలీసు కాల్
● స్కామర్ అనుకుని బూతులతో రెచ్చిపోయిన ఎంఈఓ
● బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
తాడిపత్రి టౌన్: ఓటీపీ తెచ్చిన తంటా ఏకంగా ఎంఈఓ పై కేసు నమోదుకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని జయనగర్ కాలనీ సచివాలయ మహిళా పోలీసు జ్యోతి బుధవారం ఎంఈఓ రామగోవిందు ఇంటికి ఫోన్ చేసి ఆయన భార్య సుజాతతో మాట్లాడుతూ తనను తాను పరిచయం చేసుకున్నారు. సర్వే నేపథ్యంలో వారి కుమారుడు దిలీప్‌రెడ్డి ఈ–కేవైసీ అప్‌డేట్ అనివార్యమైందని, ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పాలని కోరారు. విషయాన్ని తన పక్కనే ఉన్న భర్తకు సుజాత తెలిపింది. దీంతో అవతలి వ్యక్తి ఎవరైంది నిర్ధారించుకోకుండా స్కామర్ అనుకుని ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు. అవతల వ్యక్తి చెబుతున్నది వినకుండా తిట్ల దండకం అందుకున్నాడు. బూతులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ రామగోవిందురెడ్డి పై సీఐ ఆరోహణరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


