 
															భక్తులకు ఇబ్బందులు కలగకూడదు
న్యూస్‌రీల్
● సత్యసాయి శతజయంతి పనులన్నీ
10వ తేదీలోపు పూర్తి చేయాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి ఉత్సవాల కోసం దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన పనులన్నీ నవంబర్ 10వ తేదీలోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సత్యసాయి శత జయంత్యుత్సవాల కోసం చేపట్టిన పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. బాబా శతజయంతి కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. అనంతరం ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనులు..వాటి పురోగతి గురించి తెలుసుకున్నారు. తాగునీటి కోసం తీసుకున్న చర్యలు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో నివేదికి ఇవ్వాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పార్కింగ్ ప్రదేశాల పరిశీలన
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం కలెక్టర్ శ్యాంప్రసాద్ వివిధ ప్రదేశాలను పరిశీలించారు. బుధవారం ఆయన.. జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఆనందవిల్లాస్, టీ జంక్షన్, శిల్పారామం, చిత్రావతి బ్రిడ్జి, కర్ణాటకనాగేపల్లి, మార్కెట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
