చాటింగ్‌ మాత్రం చేశాం.. వాళ్లెవరో తెలీదు | - | Sakshi
Sakshi News home page

చాటింగ్‌ మాత్రం చేశాం.. వాళ్లెవరో తెలీదు

Oct 30 2025 7:37 AM | Updated on Oct 30 2025 7:37 AM

చాటింగ్‌ మాత్రం చేశాం.. వాళ్లెవరో తెలీదు

చాటింగ్‌ మాత్రం చేశాం.. వాళ్లెవరో తెలీదు

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విచారణలో

ఉగ్రవాద సానుభూతిపరులు

ధర్మవరం అర్బన్‌: మేము ఉగ్రవాద సంస్థల వాట్సాప్‌ గ్రూపుల్లో చాటింగ్‌ మాత్రమే చేశామని, ఉగ్రవాదులు ఎవరో...ఎక్కడుంటారో తమకు తెలియదని... ఎప్పుడూ చూడలేదని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన షాజిద్‌ హుసేన్‌, తౌసిఫ్‌ అస్లాం పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. నిషేధిక ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న ధర్మవరానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ను గతంలోనే అరెస్టు చేసిన పోలీసులు... అతని వద్ద లభించిన ఆధారాలతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన షాజిద్‌ హుసేన్‌, తౌసిఫ్‌అస్లాంలను ఈ నెల 18న అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం వారు కడప సెంట్రల్‌ జైలులో ఉండగా.. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ధర్మవరం పోలీసులు కోర్టు అనుమతితో బుధవారం వారిని మూడురోజుల కస్టడీకి తీసుకున్నారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయానికి తీసుకురాగా, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారిస్తున్నారు.

సీబీఆర్‌ నుంచి నీరు విడుదల

తాడిమర్రి: వర్షాలతో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌)కు ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు బుధవారం రిజర్వాయర్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ జోగిరెడ్డితో కలిసి సీబీఆర్‌ ఒక గేట్‌ ఎత్తి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీబీఆర్‌ ఈఈ డీ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ప్రస్తుతం సీబీఆర్‌లోకి 3,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. ఎగువ ప్రాంతాలైన బుక్కపట్నం, ధర్మవరం చెరువులు మరవపారడం, ముదిగుబ్బ మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న యోగివేమన జలాశయం నుంచి కూడా నీరు సీబీఆర్‌కు వస్తోందన్నారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. సీబీఆర్‌ దిగువ భాగాన ఉన్న తాడిమర్రి మండలంలోని తురకవారిపల్లి, దాడితోట, నాయనపల్లి, యల్లనూరు మండలం లక్షుంపల్లి, గొడ్డుమర్రి తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ చంద్రసురేష్‌, ఏఈ హనీఫ్‌, తాడిమర్రి, లింగాల మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల శిక్షణ వాయిదా

అనంతపురం టవర్‌క్లాక్‌: ఎన్నికల మాస్టర్‌ ట్రైనర్లకు ఈ నెల 30 నుంచి రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ శివశంకర్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్స్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. వాయిదా వేసిన ఈ ప్రక్రియను మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement