ఉచితం మోయలేక మొరాయింపు
ధర్మవరం రూరల్: సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రతి బస్సూ కిటకిటలాడుతోంది. ఒక బస్సులో 49 మందికి పరిమితి ఉంటే 100 నుంచి 120 మంది వరకు ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. తాజాగా బుధవారం అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా అధిక సంఖ్యలో ప్రయాణికులతో పుట్టపర్తికి బయలుదేరిన బస్సు ధర్మవరం రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ముందుకు కదలలేనంటూ మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఆటోలలో గమ్య స్థానాలకు వెళ్లాల్సి వచ్చింది.
బొలెరోపై దూసుకెళ్లిన కంటైనర్
తనకల్లు: బొలెరో వాహనంపై కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... తనకల్లు మండలం దండువారిపల్లికి చెందిన రెడ్డిశేఖర్‌రెడ్డి, మహదేవ్ బుధవారం టమాట పంటను బొలెరో వాహనంలో లోడు చేసుకుని అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు బయలుదేరారు. సీజీ ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే టైర్లలో గాలి కొట్టించేందుకు రోడ్డు పక్కన ఉన్న పంక్చర్ షాపు వద్ద ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్... బొలెరో మీదుగా దూసుకెళ్లింది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. రెడ్డిశేఖర్‌రెడ్డి, మహదేవ్ తీవ్ర గాయాలతో క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు అశోక్, శ్రీనాథ్, తండేల్, నవీన్, మణి, స్థానికులు అక్కడకు చేరుకుని క్రేన్, జేసీబీ సాయంతో క్షతగాత్రులను వెలికి తీశారు. అనంతరం తమ ఉచిత అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి వందేమాతరం టీం సభ్యులు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కదిరికి తీసుకెళ్లారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
రొళ్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం గోవిందాపురంగొల్లహట్టి గ్రామానికి చెందిన సిద్ధప్ప (48) దేవరాజు బుధవారం ఉదయం రొళ్లకు వచ్చారు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కొడగార్లగుట్ట క్రాస్ వద్దకు చేరుకోగానే జీడీ పాళ్యం గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం నుంచి ద్విచక్ర వాహనంపై రొళ్లగొల్లహట్టి చెందిన వెంకటేష్ జాతీయ రహదారి పైకి చేరుకున్నాడు. అప్పటికే అతి సమీపంలోకి చేరుకోవడంతో వాహనాన్ని తప్పించే క్రమంలో వెంకటేష్ బైక్‌ను ఢీకొని ముగ్గురూ కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో సిద్ధప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దేవరాజు, వెంకటేష్‌ను హైవే అంబులెన్స్ వాహనంలో మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఉచితం మోయలేక మొరాయింపు


