 
															రాజీనామా చేసిన ఉద్యోగికి వేతనం!
సాక్షి, పుట్టపర్తి
అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి అండదండలతో ఐసీడీఎస్‌లో పని చేసే ఓ మహిళా అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తి పరిధిలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారి... ఇటీవల రాజీనామా చేసిన ఓ ఉద్యోగికి రెండు నెలలుగా వేతనం ఖాతాలో జమ చేస్తున్నారు. ఐసీడీఎస్‌లో జరిగిన అవినీతి ఆరోపణలపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణకు రావడంతో ‘రాజీనామా చేసిన ఉద్యోగికి వేతనం’ విషయం వెలుగు చూసింది. మరింత లోతుగా విచారణ చేపడితే కోడిగుడ్ల నుంచి పౌష్టికాహారం వరకూ మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు ఐసీడీఎస్ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
రికార్డుల్లోనూ పక్కాగా నమోదు..
పుట్టపర్తి మున్సిపాలిటీ పెద్ద కమ్మవారిపల్లి అంగన్‌వాడీ కేంద్రం హెల్పర్ గత జూన్ 5వ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే సెప్టెంబరు వరకు ఆమెకు వేతనం బ్యాంకు ఖాతాకు జమ చేస్తూనే వచ్చారు. ఆ విషయాన్ని రికార్డుల్లో సైతం నమోదు చేశారు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కడం.. రికార్డుల పరంగా ఆధారాలు ఉండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రాజీనామా చేసిన ఉద్యోగిని పిలిపించి.. నగదు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అయితే వేతనం ఇచ్చారనే విషయమే తనకు తెలియదని.. బ్యాంకు ఖాతాలో పరిశీలించాలని ఆమె చెప్పడంతో.. ఆర్‌ఆర్ (రివర్సర్ రికవరీ) యాక్ట్ గురించి భయపెట్టి.. ఒప్పించినట్లు తెలిసింది. ఇక వేతనం మంజూరు చేసేందుకు సహకరించిన ఇద్దరు ఉద్యోగులకు మెమో జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తప్పిదం జరిగిందా? లేక అవినీతి అక్రమాల్లో భాగంగా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో చేశారా? అనేది చర్చనీయంగా మారింది.
ఆమైపె ఆరోపణలెన్నో..
పుట్టపర్తి ఐసీడీఎస్ విభాగంలో పనిచేసే ఓ మహిళా అధికారిపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో ఉద్యోగిగా ఉండగా.. అధికార పార్టీ నేతల అండదండలతో ఆ మహిళా అధికారి అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయన్న ఆరోపణలున్నాయి. సదరు అధికారిణి సమావేశాల నిర్వహణ పేరుతో అంగన్‌వాడీ సిబ్బంది నుంచి కనీసం మూడు కిలోల చొప్పున డ్రై ఫ్రూట్స్ తేవాలని డిమాండ్ చేస్తారట. రోజూ ప్రభుత్వ వాహనాన్ని తన సొంత పనులకు వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. సదరు అధికారి నిర్లక్ష్యంతో కొత్తచెరువు మండల పరిధిలో ఓ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపించి సరుకులు దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పుట్టపర్తి మండల పరిధిలోనూ ఓ చోట ఇదే తంతు జరుగుతోందనే ఆరోపణలున్నాయి. సదరు అధికారి నిర్వాకంతో సిబ్బంది ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే.. రాజీనామా చేసిన ఉద్యోగికి వేతనం మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
రికవరీ చేయిస్తాం
పుట్టపర్తి మున్సిపాలిటీలోని పెద్ద కమ్మవారిపల్లిలో అంగన్‌వాడీ హెల్పర్ గత జూన్ 5వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత రెండు నెలల పాటు వేతనం ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులకు మెమో జారీ చేశాం. రాజీనామా చేసిన హెల్పర్‌తో బ్యాంకు ఖాతా నుంచి ఆ నగదును రికవరీ చేయిస్తాం.
– జయంతి, సీడీపీఓ, పుట్టపర్తి
ఎవరైనా సరే ఉద్యోగానికి రాజీనామా చేస్తే.... ఆ రోజు నుంచే వారికి వేతనం మంజూరు కాదు. కానీ ఘనత వహించిన ఐసీడీఎస్ అధికారులు రాజీనామా చేసిన ఉద్యోగికి రెండు నెలలుగా వేతనం ఖాతాలో జమ చేస్తున్నారు. గట్టిగా
నిలదీస్తే నెపం ఒకరిపై మరొకరు
నెట్టుకుంటున్నారు.
ఐసీడీఎస్‌లో అవకతవకలు
రెండు నెలల పాటు వేతనం
అందించిన వైనం
గుట్టుచప్పుడు కాకుండా
రికవరీకి యత్నం
జీతం విషయమే తనకు
తెలీదంటోన్న ఉద్యోగి
ఓ మహిళా అధికారి కనుసన్నల్లోనే తతంగం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
