 
															ఏడు మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో వరుసగా ఐదో రోజు శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఒకే రోజు 72.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధర్మవరం మండలం 24.0 మి.మీ, చెన్నేకొత్తపల్లి 19.4 మి.మీ వర్షం కురిసింది. ఇక బత్తలపల్లి మండలంలో 13.4 మి.మీ, రామగిరి 5.6, కనగానిపల్లి 4.2, ముదిగుబ్బ 3.6, సోమందేపల్లి మండలంలో 1.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
● మంథా తుపాను నేపథ్యంలో
సిబ్బందికి కలెక్టర్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ‘మంథా’ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి అన్ని డివిజన్ల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులు, ప్రత్యేక అధికారులు, విపత్తుల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై చర్చించారు. వాగులు, వంకల ప్రవాహ తీవ్రతను ముందే పసిగట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఆయా శాఖల పరిధిలో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సత్యసాయి
జయంత్యుత్సవాలకు రైళ్లు
గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు–చైన్నె ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నవంబర్ 19, 20, 21, 22 తేదీల్లో నడుస్తాయి. నవంబర్ 19న చైన్నె (06091)లో రాత్రి 11.30 గంటలకు రైలు బయలుదేరి గుంతకల్లు జంక్షన్‌కు గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరిగి ఈ రైలు 20న ఇక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చైన్నె చేరుతుంది. యలహంక, హిందూపురం, పుట్టపర్తి సత్యసాయి నిలయం రైల్వేస్టేషన్, ధర్మవరం, అనంతపురం, గుత్తి మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుంది. అలాగే కాచిగూడ–తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (గురువారం) కాచిగూడ జంక్షన్ (07787) నుంచి రాత్రి 10.25 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 7, 14, 21, 28 తేదీల్లో తిరుచూనూరు రైల్వేస్టేషన్ (07788)లో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ జంక్షన్ చేరుతుంది. ఇది షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది.
బైక్ సర్వీసుకు అదనపు చార్జీ వసూలుపై కొరడా
● తిప్పయ్య మోటార్స్‌కు
రూ.25 వేల జరిమానా
అనంతపురం: బైక్ సర్వీసుకు అదనపు చార్జీలు వసూలు చేసిన తిప్పయ్య మోటార్స్‌పై వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది. వివరాలు.. నగరంలోని అరుణోదయ కాలనీకి చెందిన అబ్దుల్ గఫూర్ తన స్ల్పెండర్ బైక్‌ను ఆర్‌ఎఫ్ రోడ్డులోని తిప్పయ్య మోటార్స్‌లో సర్వీస్ చేయించాడు. హెడ్‌లైట్, మరికొన్ని మరమ్మతులు చేసినందుకు గానూ రూ.1,318 బిల్లు చెల్లించాడు. అయితే, ఎక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేసినట్లు గుర్తించిన గఫూర్ మేనేజర్‌ను సంప్రదించినా సరైన సమాధానం రాలేదు. దీంతో తిప్పయ్య మోటార్స్‌కు లీగల్ నోటీసు పంపి వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. వినియోగదారుడికి ఒక తరహాలో, ప్రభుత్వానికి చూపే జమా ఖర్చుల్లో మరో తరహా బిల్లును ఇస్తున్నట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ చేపట్టిన కమిషన్.. నైట్రోజన్ గాలికి రూ.20, ఇందుకు అదనంగా జీఎస్టీ రూ.3.60 వసూలు చేయడం సేవాలోపంగా గుర్తించింది. అదనపు సర్వీసు చార్జీలు వసూలు చేసిన తిప్పయ్య మోటార్స్‌కు రూ.25 వేల జరిమానా, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటివి పునరావృతమైతే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని కమిషన్ అధ్యక్షురాలు శ్రీలత, సభ్యులు డి. గ్రేస్‌మేరీ, బి. గోపీనాథ్ హెచ్చరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
