పేరుకే హోదా.. పట్టభద్రులకు వ్యఽథ | - | Sakshi
Sakshi News home page

పేరుకే హోదా.. పట్టభద్రులకు వ్యఽథ

Oct 26 2025 6:53 AM | Updated on Oct 26 2025 6:53 AM

పేరుకే హోదా.. పట్టభద్రులకు వ్యఽథ

పేరుకే హోదా.. పట్టభద్రులకు వ్యఽథ

15 నెలలుగా ఇన్‌చార్జ్‌ వీసీతోనే నెట్టుకొస్తున్న ఎస్కేయూ

కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేక ఇబ్బందులు

ఇప్పటికే రెండు దఫాలు సెర్చ్‌ కమిటీ నియామకం

అయినా పూర్తి కాని వీసీ ఎంపిక ప్రక్రియ

రెండేళ్లుగా డిగ్రీలు ప్రదానం చేయని పరిస్థితి

స్నాతకోత్సవం నిర్వహించలేని

స్థితిలో వర్సిటీ యాజమాన్యం

అనంతపురం: పాలనాపరమైన ఇబ్బందులతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కొట్టుమిట్టాడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇన్‌చార్జ్‌ వీసీకి లేకపోవడమే ఇందుకు కారణం. వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీగా ప్రొఫెసర్‌ బి.అనిత నియామకమై 15 నెలలు పూర్తయింది. ఇప్పటికే రెండు దఫాలుగా సెర్చ్‌ కమిటీ నియామకమైనా పూర్తి స్థాయి వీసీ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తోంది. ఇదిగో..అదిగో అంటూ ఊరడిస్తూ కాలయాపన చేస్తోంది. ఈ క్రమంలో కీలకమైన తీసుకోలేని అసహాయ స్థితిలో సాధారణమైన అంశాలకే ఇన్‌చార్జ్‌ వీసీ పరిమితం అవుతున్నారు. అలాగే రిజిస్ట్రార్‌ నియామకంలో నిబంధనలకు కూటమి సర్కార్‌ తిలోదకాలు ఇవ్వడంతో పాలన గాడి తప్పింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయి కాని, డిప్యూటీ రిజిస్ట్రార్‌ (డీఆర్‌) హోదాలో ఉన్న వారిని గాని రిజిస్ట్రార్‌గా నియామకం చేయాలి. ఇందుకు విరుద్ధంగా స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ స్థాయి ఉన్న వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియమించడం వివాదస్పదమైంది. అన్ని అర్హతలున్న వారు ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. కేవలం ఓ సామాజిక వర్గానికి పట్టం కట్టాలనే ఉద్దేశ్యంతోనే రిజిస్ట్రార్‌ నియామకంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్‌ స్థాయి వ్యక్తి రిజిస్ట్రార్‌గా ఉంటే వర్సిటీ, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.

మూడేళ్ల క్రితం స్నాతకోత్సవం

వాస్తవానికి స్నాతకోత్సవం ఏటా లేదా రెండేళ్లకు ఓ సారి నిర్వహిస్తుంటారు. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్‌ డిగ్రీ అందించాలంటే స్నాతకోత్సవ నిర్వహణ తప్పనిసరి. చివరి సారిగా 2023, జులైలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ మూడేళ్లుగా స్నాతకోత్సవం ఊసే లేకుండా పోయింది. ఫలితంగా 20 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. డిగ్రీ పూర్తయి పీజీ కోర్సులు చేయాలంటే యూజీ పట్టా అనివార్యం. దీంతో చాలా మంది ఇన్‌అడ్వాన్సెడ్‌ కింద స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకుని పట్టా పొందుతున్నారు. దీంతో అదనపు ఫీజుల రూపంలో వేలాది మంది విద్యార్థుల జేబులకు చిల్లుపడుతోంది. స్నాతకోత్సవం నిర్వహించలేని అసహాయ స్థితిలో వర్సిటీ యాజమాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్‌అడ్వాన్సెడ్‌ స్నాతకోత్సవం కింద విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టుకునే కుట్ర సాగుతోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

హేమలత... 2024, జులైలో బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్సెస్‌) కోర్సు పూర్తి చేసింది. అనంతరం సాఫ్ట్‌వేర్‌ కోర్సు ఒరాకిల్‌ హైదరాబాద్‌లో అభ్యసించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న ఆమెకు నియామక పత్రం (ఆఫర్‌ లెటర్‌) తీసుకున్న తక్షణమే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ అధికారులు సూచించారు. దీంతో సంబంధిత డిగ్రీ కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌ను అడిగితే.. వర్సిటీ అధికారులు స్నాతకోత్సవం నిర్వహించలేదు కాబట్టి ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కాన్వొకేషన్‌ ( ముందస్తు స్నాతకోత్సవ పట్టా) డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ సూచించారు. ఈ మేరకు ఎస్కేయూకు వెళ్లి ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కాన్వొకేషన్‌కి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు గాను రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి స్నాతకోత్సవం నిర్వహించి ఉంటే పట్టా ఫీజు కేవలం రూ.2,500 మాత్రమే. ఇలా హేమలత ఒక్కరే కాదు.. స్నాతకోత్సవ డిగ్రీ కావాలనుకునే ప్రతి విద్యార్థి అదనంగా చెల్లించాల్సి రావడంతో జేబులకు

చిల్లు పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement