 
															తాగునీటి కోసం మహిళల ఆందోళన
రొళ్ల: భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలోనూ తాగునీటి కోసం తాము పడరాని పాట్లు పడుతున్నామని పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. శనివారం ఖాళీ బిందెలతో వచ్చి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే తమ కాలనీకి తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
వారం రోజులుగా నీరు లేదు..
మండల కేంద్రం రొళ్ల సమీపాన ఉన్న మారుతి కాలనీకి నీటి సరఫరా చేసే బోరులో వారం రోజుల క్రితం మోటర్ ఇరుక్కుపోయింది. అప్పటి నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో శనివారం కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేంత వరకూ కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జ్ ఈఓఆర్డీ శ్రీనాథ్..మహిళల వద్దకు వచ్చి మాట్లాడారు. రెండు రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సాయంత్రం మరో బోరుబావి నుంచి మారుతి కాలనీకి నీటిని తాత్కాలికంగా నీరు సరఫరా చేశారు. అయితే రెండు రోజుల్లోపు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మహిళలు హెచ్చరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
