 
															ఆ గ్రామంలో పాఠశాల మధ్యాహ్నం వరకే!
బత్తలపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాలి. అయితే బత్తలపల్లి మండలం సంగాల గ్రామంలో మధ్యాహ్నం వరకే నిర్వహిస్తుండడం గమనార్హం. పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం తర్వాత విద్యార్థులను ఇంటి దారి పట్టించి తన దారిన తాను వెళ్లిపోతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై విద్యాధికారులు పర్యవేక్షణ లోపించడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. విషయంపై ఎంఈఓ–2 సుధాకర్‌నాయక్‌ను వివరణ కోరగా.. సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. సమస్య ఏమిటో తెలుసుకుని ఉపాధ్యాయుడితో ఆరా తీస్తామన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
