తాగేందుకు నీళ్లూ ఇవ్వలేరా?
గుడిబండ: వారం రోజుల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కేఎన్ పాళ్యం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహిళలు, గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుడిబండ–మడకశిర ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీటి సమస్యపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా స్పందన కరువైందని మహిళలు వాపోయారు. ఈ క్రమంలోనే పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.


