అక్రమాలకు ‘రాజ’మార్గం
● పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక నింపుకుని అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్.. పేరూరు శివారున కురుగుంట్ల వద్ద ముందు వెళ్తున్న ఓ టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కిందపడిన వ్యక్తులపై ట్రాక్టర్ మీద వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది.
● ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి చెన్నేకొత్తపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం తరలివెళ్తోంది. జాతీయ రహదారిలో వాహనాల్లోకి బియ్యం బస్తాలు మార్చుకుని.. ఆటోలు, ట్రాక్టర్లు, టిప్పర్లలో నింపి కర్ణాటకకు తరలిస్తున్నారు. రోజూ చెన్నేకొత్తపల్లి నుంచి సోమందేపల్లి, హిందూపురం మీదుగా రేషన్ బియ్యం వాహనాలు సరిహద్దు దాటిపోతున్నాయి. తాజాగా గురువారం కూడా చెన్నేకొత్తపల్లి సమీపంలో అధికారులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
సాక్షి, పుట్టపర్తి
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమార్జనే ధ్యేయంగా ‘తెలుగు తమ్ముళ్లు’ రెచ్చిపోతున్నారు. రాత్రింబవళ్లు ఇసుక, రేషన్ బియ్యం తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అడపాదడపా దాడులు చేసి చేసి.. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో జిల్లా అక్రమ దందాకు అడ్డుకట్ట పడటం లేదు.
చెన్నేకొత్తపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం దందా
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, అనంత పురం, నార్పల, కొత్తచెరువు, నల్లమాడ, ధర్మవరం తదితర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం జాతీయ రహదారి గుండా చెన్నేకొత్తపల్లి వరకు చేరుకుంటుంది. అక్కడ వాహనాలు మారి పలు మార్గాల్లో సరిహద్దు దాటిపోతోంది. ఈ తతంగమంతా రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. ఇక పగటి వేళ ఇసుక దందా విచ్చలవిడిగా సాగుతోంది. రామగిరి, పుట్టపర్తి, గోరంట్ల, రొద్దం, పరిగి,ధర్మవరం, చిలమత్తూరు తదితర ప్రాంతాల్లో పెన్నా, చిత్రావతి, కుముద్వతి, జయమంగళి నదులను అక్రమార్కులు తోడేస్తూ పట్టపగలే అక్రమంగా రవాణా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
ఏ మారుమూల పల్లెలో చూసినా రేషన్ బియ్యం కొనుగోలుదారులు కనిపిస్తున్నారు. కిలో బియ్యం రూ.15తో కొనుగోలు చేసి అక్కడక్కడా నిల్వలు ఉంచి.. రాత్రివేళల్లో ఆటోల ద్వారా జాతీయ రహదారి వరకూ వచ్చి.. అక్కడ పెద్ద వాహనాల్లో చేర్చి.. కర్ణాటకలో కిలో రూ.30 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటకలో రైస్ మిల్లులలో పాలిష్ చేసి అవే బియ్యాన్ని కిలో రూ.50తో తిరిగి ప్రజలకు అమ్ముతున్నారు. సన్నబియ్యం పేరుతో లేబుళ్లు తయారు చేసి సరికొత్త ప్యాకెట్లలో ఉంచి విక్రయాలు సాగిస్తున్నారు. సోమందేపల్లికి చెందిన టీడీపీ నేత, నల్లమాడకు చెందిన మరో తెలుగు తమ్ముడు కనుసన్నల్లోనే జిల్లాలో రేషన్ బియ్యం దందా సాగుతోందని సమాచారం. అన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు
అతివేగంతో ప్రమాదాలు..
రేషన్ బియ్యం, ఇసుక తరలించే వాహనాలు అతి వేగంతో వెళ్తూ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పోలీసులకు పట్టుబడితే ఇబ్బందులు తప్పవని.. సరిహద్దు దాటే వరకు బియ్యం వాహనాలు అతివేగంగా వెళ్తాయి. నదీ ప్రాంతాల నుంచి ఇసుక ట్రాక్టర్లు అరగంటలో గమ్యస్థానం చేరేలా దూరాన్ని అంచనా వేస్తూ టైమింగ్ ప్రకారం వేగం పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనాలనో...లేక పాదచారులనో ఢీ కొడుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది.


