అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
చెన్నేకొత్తపల్లి: అక్రమంగా కర్ణాటకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని చెన్నేకొత్తపల్లి సమీపంలో రెవెన్యూ అధికారులు గురువారం పట్టుకున్నారు. వివరాల్లోకెళితే... అనంతపురం నుంచి ఓ ఐచర్ వాహనంలో గురువారం కొందరు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం తుముకూరుకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సురేష్ కుమార్, ఆర్‌ఐ నరసింహమూర్తి సిబ్బందితో కలిసి మాటు వేశారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. వాహనంలో బియ్యం కనిపించగా... డ్రైవర్ రాజును ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాన్ని చెన్నేకొత్తపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వాహనంలో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయని డ్రైవర్‌ను ప్రశ్నించగా...90 క్వింటాళ్ల (180 పాకెట్లు) బియ్యం ఉన్నాయని, బిల్లులు మాత్రం తన వద్ద లేవని చెప్పాడు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. దాడుల్లో వీఆర్‌ఓ నారాయణస్వామి, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.


