ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి జిల్లాలో ప్రకృతి సేద్యం సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూమాత రక్షణ, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి సేద్యంపై గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ రసాయన ఎరువుల వినియోగం జరుగుతుందో గుర్తించి ఆయా గ్రామాల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే ఎరువుల అధిక ధరలకు విక్రయించకుండా నిరోధించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘డైట్’లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
అనంతపురం సిటీ: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీసు)పై భర్తీ చేయనున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 30, 31 తేదీల్లో స్క్రూటినీ, నవంబర్ 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. నవంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఖాళీల వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం వెబ్‌సైట్ చూడాలన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు గుట్టూరు విద్యార్థులు
పెనుకొండ రూరల్: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు గుట్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు నాగార్జున తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అనంతపురం జిల్లాలో నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. అండర్–19 విభాగంలో 8వ తరగతి విద్యార్థి ఉమా లక్ష్మి, అండర్–17 విభాగంలో 8వ తరగతి విద్యార్థి సంధ్యావతి, అండర్– 14 విభాగంలో ఏడో తరగతి విద్యార్థులు పల్లవి, మోనా కర్ణిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం వివరించారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
కొనసాగుతున్న వర్షాలు
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో వరుసగా మూడోరోజు గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా జడివాన కురిసింది. 32 మండలాల పరిధిలో 434.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 29.8 మి.మీ, నల్లమాడ మండలంలో 28 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తాడిమర్రి మండలంలో 25.0 మి.మీ, ఎన్‌పీ కుంట 22.4, సీకేపల్లి 22.2, రామగిరి 20.8, రొద్దం 20.4, కదిరి 18.4, బత్తలపల్లి 17.6, గాండ్లపెంట 16.4, గోరంట్ల 15.2, ధర్మవరం 14.6, తలుపుల 14.2, రొళ్ల 14.2, గుడిబండ 13.2, హిందూపురం 12.8, ముదిగుబ్బ 12.6, కొత్తచెరువు 11, ఓడీచెరువు 10.2, చిలమత్తూరు 10.2, బుక్కపట్నం 9.6, అగళి 9, నల్లచెరువు 9, తనకల్లు 8.4, సోమందేపల్లి 8.2, పెనుకొండ 8.0, మడకశిర 7.0, అమరాపురం 6.4, పుట్టపర్తి 6.2, అమడగూరు 5.8, లేపాక్షి 5.4, పరిగి మండలంలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వారం రోజులుగా వాన తెరిపినివ్వకపోవడంతో పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించండి
ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించండి


